తెలుగు రాష్ట్రాలను సస్యశ్యామలం చేస్తాం!
Send us your feedback to audioarticles@vaarta.com
పాలమూరు ఎత్తిపోతల పథకంపై తెలంగాణ సీఎం కేసీఆర్ గురువారం నాడు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కేసీఆర్.. గోదావరి-కృష్ణా నదుల అనుసంధానంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఏపీతో చర్చలు జరుగుతున్నాయని.. నదుల అనుసంధానం జరిగితే రెండు రాష్ట్రాలు బాగపడతాయని కేసీఆర్ చెప్పుకొచ్చారు. గోదావరి నుంచి శ్రీశైలానికి నీళ్లు తరలించి రిజర్వాయర్లో ఎప్పుడూ నీళ్లు ఉండేలా చూస్తామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఈ రెండు నదులను కలిపి తెలుగు రాష్ట్రాలను సస్యశ్యామలం చేస్తామని గులాబీ బాస్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఏపీ ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్న తర్వాత పనులు ప్రారంభమవుతాయని.. ఏపీ సీఎం వైఎస్ జగన్తో జరగబోయే తదుపరి సమావేశంలో దీనిపై ఓ స్పష్టత వచ్చే అవకాశముందని కేసీఆర్ చెప్పుకొచ్చారు. వనపర్తిలో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో కేసీఆర్ మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.
జగన్ కోరారు.. సఫలమైతే బ్రహ్మాండమైన ఫలితం!
‘గోదావరి కృష్ణను అనుసంధానం చేద్దామని జగన్ కోరారు. గోదావరి నీటితో శ్రీశైలం ప్రాజెక్టును నింపుదామని ప్రతిపాదన తెచ్చారు. ఈ అంశంపై ఏపీతో చర్చలు జరుగుతున్నాయి. అవి సఫలమైతే బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. శ్రీశైలం ద్వారా మహబూబ్ నగర్, దక్షిణ నల్గొండ, నాగార్జున సాగర్ ద్వారా నల్గొండ, రంగారెడ్డి జిల్లాలు సస్యశ్యామలమవుతాయి. రేపు కృష్ణా-గోదావరి అనుసంధానంపై ఆంధ్రా, తెలంగాణ తగు రీతిలో ఒప్పందాలు చేసుకుంటాం. ఆ తర్వాత ప్రాజెక్టు పనులు ప్రారంభమవుతాయి. సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరుగుతున్నాయి. ఇది అసాధ్యమేమీ కాదు’ అని కేసీఆర్ స్పష్టం చేశారు.
చంద్రబాబు సాధించింది సున్నానే..!
‘గోదావరి-కృష్ణా అనుసంధానంపై చంద్రబాబునాయుడు అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారు. నీటి పారుదలపై కాంగ్రెస్ నేతలకు అవగాహన లేదు. కాళేశ్వరం ప్రాజెక్టుపైనా ఎన్నో విమర్శలు చేశారు. కానీ ప్రపంచమంతా ఆ ప్రాజెక్టును పొగుడుతోంది. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా ప్రజాప్రయోజనాల కోసం తమ పని తాము చేసుకుపోతాం. కొన్ని ప్రగతి నిరోధక శక్తుల వల్ల ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమైంది. రాబోయే రోజుల్లో అద్భుతాన్ని చూడబోతున్నాము. పాలమూరు ఎత్తిపోతల పథకం రాబోయే 10 మాసాల్లో పూర్తవుతుంది. గత పాలకుల అసమర్థత వల్ల తెలంగాణకు అన్యాయం జరిగింది. మంచినీళ్ల కోసం మనం అనేకసార్లు కర్ణాటకను బతిమాలినం. దీనికి గోదావరిని కృష్ణాతో అనుసంధానం చేసుకోవడం ఒక్కటే మార్గం. చంద్రబాబు నాయుడు కుంచిత మనస్తత్వంతో మాట్లాడుతున్నారు. గతంలో ఇదే చంద్రబాబు బాబ్లీ మీద గొడవపెట్టుకుని ఏమి సాధించలేదు. పరవాడ ప్రాజెక్టులతో గొడవపెట్టుకున్న చంద్రబాబు సాధించింది సున్నానే. ఎక్కడ ప్రాజెక్టు కట్టినా గొడవ చేసి హంగామా క్రియేట్ చేశారు’ అని బాబుపై ఈ సందర్భంగా కేసీఆర్ విమర్శనాస్త్రాలు విసిరారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments