మార్పు.. యూటర్న్లు.. న్యూ ఇయర్లో కేసీఆర్ 2.0..
- IndiaGlitz, [Wednesday,December 30 2020]
2020 ఎండింగ్ తెలంగాణ సీఎం కేసీఆర్‌లో ఊహించని మార్పు తీసుకొచ్చింది. ఆ మార్పు ఎందుకు..? ఏమిటి? అని ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల దెబ్బ కేసీఆర్‌కు దారుణంగా తగిలిందనడంలో సందేహం లేదు. ఇకపై కూడా ఇదే శైలిని కొనసాగిస్తే అసెంబ్లీ ఎన్నికల్లో దారుణంగా దెబ్బ తినాల్సి వస్తుందన్న సత్యాన్ని తెలుసుకుని ఉండొచ్చు. అందుకే వెంటనే అలర్ట్ అయ్యారు. ఎవరిని ఊరుకోబెడితే పరిస్థితి అదుపులోకి వస్తుందో అంచనా వేశారు. అంతే.. ఎవరూ ఊహించని రీతిలో వరుస యూటర్న్లు తీసుకున్నారు. మోనార్కిజాన్ని పక్కనబెట్టి కేసీఆర్ వరుసగా కీలక నిర్ణయాలే తీసుకుంటూ వస్తున్నారు.
కేంద్ర వ్యవసాయ చట్టాలపై యూ టర్న్..
ఎల్ఆర్ఎస్ కారణంగా ఇబ్బందిపడుతున్న సామాన్య ప్రజానీకం.. ఉద్యోగుల విషయంలో.. విద్యార్థులు, రైతన్నలే లక్ష్యంగా కీలక నిర్ణయాలు తీసుకుంటూ శుభవార్తల మీద శుభవార్తలు చెబుతూ వెళుతున్నారు. మొత్తానికి నూతన సంవత్సరంలో ప్రజలు కేసీఆర్ 2.0ను చూడటం ఖాయంగా కనిపిస్తోంది. కేంద్ర వ్యవసాయ చట్టాలపై యూటర్న్ ముందుగా భారత్ బంద్‌కు మద్దతు ఇవ్వడం.. ఆ తర్వాత విమర్శల వర్షం కురిపించడం.. తీరా చూస్తే వ్యవసాయ చట్టాలపై యూటర్న్ తీసుకోవడం..(ఢిల్లీ పర్యటన తర్వాత వచ్చిన కీలక మార్పు)
ఎల్ఆర్ఎస్పైన యూటర్న్..
ఎల్ఆర్ఎస్ పైనా కేసీఆర్ యూటర్న్ తీసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్పై (వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు) ప్రజానీకం నుంచి వ్యతిరేకత వస్తోంది. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు ఎల్ఆర్ఎస్ను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాయి. ఈ క్రమంలో కేసీఆర్ ఎల్ఆర్ఎస్ విషయంలో స్పష్టతనిచ్చింది. రిజిస్ట్రేషన్లకు ఎల్ఆర్ఎస్ నిబంధనను ఎత్తివేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.
ఉద్యోగులకు కేసీఆర్ కానుక..
నిన్న మొన్నటి వరకూ ఉద్యోగులను అసలు ఏమాత్రం పట్టించుకోని కేసీఆర్.. ఉన్నట్టుండి సడెన్‌గా వరాల జల్లు కురిపించారు. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగులతో చర్చలకు సీఎస్ అధ్యక్షుడిగా కమిటీని ఏర్పాటు చేశారు. రాష్ట్ర ఉద్యమంలో ఉద్యోగులది కీలక పాత్ర అని కేసీఆర్ గుర్తు చేశారు. సరళమైన రీతిలో ఉద్యోగులకు సర్వీస్ రూల్స్.. పదవీ విరమణ రోజు ఆఫీసులోనే ఘనంగా సన్మానం.. ఇకపై విరమణ రోజే బెనిఫిట్స్ వంటి కీలక నిర్ణయాలతో ఉద్యోగుల మనసు గెలిచే ప్రయత్నం చేస్తున్నారు.
ఖాళీల భర్తీకి ఆదేశం.. ఆర్టీసీకి ఉద్యోగులకు శుభవార్త..
ఇప్పటి వరకూ రాష్ట్రంలో నియామకాల ఊసే ఎత్తని కేసీఆర్.. తాజాగా భారీగా భర్తీలు చేయాలని నిర్ణయించారు. అన్ని శాఖల్లో ఖాళీల భర్తీకి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. అలాగే.. ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్తను అందించారు. ఆర్టీసీ ఉద్యోగులకు వేతనాలను పెంచాలని నిర్ణయించారు. ఇకపై ఆర్టీసీపై భారమంతా ప్రభుత్వమే భరిస్తుందని వెల్లడించారు. ఫిబ్రవరిలోపు ఉద్యోగుల సమస్యలు పరిష్కారం.. ఫిబ్రవరి నుంచి ఉద్యోగ నియామకాల ప్రక్రియను చేపడతామని వెల్లడించారు. మొత్తమ్మీద చూస్తే.. విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, రైతుల సమస్యలను పరిష్కరించి రానున్న ఎన్నికల్లో విజయ పతాకం ఎగరేయాలని కేసీఆర్ పక్కా వ్యూహంతో ఇలా చేసుకుంటూ పోతున్నారని చెప్పుకోవచ్చు. మరి కేసీఆర్ అందిస్తున్న శుభవార్తలు.. తీసుకుంటున్న యూటర్న్‌లతో ఎంత మేర ప్రజల మనసును గెలుస్తారో వేచి చూడాలి.