ప్రధానితో కేసీఆర్ భేటీ.. పలు కీలక విషయాలపై చర్చ..

తెలంగాణ సీఎం కేసీఆర్ శనివారం రాత్రి 7 గంటలకు ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. లోక్‌కళ్యాణ్ మార్గ్‌లోని ప్రధాని అధికారిక నివాసానికి వెళ్లిన కేసీఆర్.. సుమారు 45 నిమిషాల పాటు మోదీతో భేటీ అయ్యారు. ఈ భేటీలో పలు కీలక విషయాలపై మోదీతో కేసీఆర్ చర్చించినట్టు తెలుస్తోంది. ఎన్నికల విషయాన్ని పక్కనబెడితే.. అభివృద్ధి విషయంలో మాత్రం కలిసికట్టుగా సాగుదామని మోదీకి కేసీఆర్ చెప్పిన్టటు తెలుస్తోంది. ఇటీవల భారీ వర్షాల కారణంగా జరిగిన నష్టాన్ని వివరించడంతో పాటు వరద బాధితులను ఆదుకునేందుకు రూ.1300 కోట్లు అందించాలని కేంద్రానికి లేఖ రాసిన విషయాన్ని సైతం కేసీఆర్ గుర్తు చేశారు. ఆ నిధులను విడుదల చేసి రాష్ట్రాన్ని ఆదుకోవాలని కోరారు.

అలాగే కోవిడ్ వ్యాక్సిన్‌ను ఉచితంగానో లేదంటే ప్రజలకు అందుబాటు ధరలోనో అందించాలని మోదీకి విజ్ఞప్తి చేశారు. దీనికోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా నడవాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే.. తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు రూ.25 కోట్లు అందించాలని నీతి ఆయోగ్ సూచించిన విషయాన్ని వెల్లడించి సహకారం కోరారు. కరోనా వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు గ్రాంట్‌ విడుదల చేయాలని అభ్యర్థించారు. స్వచ్ఛ భారత్ మిషన్, 15వ ఆర్థిక సంఘం, అమృత్ పథకాలకు రావల్సిన బకాయిలను విడుదల చేయాలని ప్రధానిని అభ్యర్థించారు.

కాగా.. సన్న ధాన్యం కొనుగోలుకు భారత ఆహార సంస్థ ముందుకు రావడం లేదని దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల మధ్య నెలకొన్న అంతర్రాష్ట్ర జలవివాదాల అంశాన్ని కూడా కేసీఆర్‌ ప్రస్తావించినట్లు తెలిసింది. కేంద్రం ఆదేశాలకు భిన్నంగా ఏపీలో పోతిరెడ్డిపాడు విస్తరణ పనులు రహస్యంగా జరుగుతున్నాయని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణలో కాళేశ్వరం లేదా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుల్లో ఒకదానికి జాతీయ హోదా ఇవ్వాలని కోరినట్టు తెలుస్తోంది. ఎఫ్ఆర్‌బీఎం పరిమితి పెంచితే రాష్ట్రాలకు ఉపశమనం కలుగుతుందని.. కాబట్టి ఈ విషయంపై దృష్టి సారించాలని మోదీని కోరినట్టు తెలుస్తోంది. రక్షణ, వైమానికి ఉత్పత్తులకు హైదరాబాద్ కేంద్ర స్థానంగా ఎదిగిందని.. కాబట్టి రక్షణ ఉత్పత్తుల తయారీ కారిడార్‌ను రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని మోదీని కేసీఆర్ కోరారు.