రాజకీయంగా చర్చనీయాంశంగా.. అమిత్ షాతో కేసీఆర్ భేటీ..
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ సీఎం కేసీఆర్ శుక్రవారం వెళ్లి కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవలి కాలంలో రాష్ట్రంలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు మారిపోయాయి. ఇటువంటి పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి అమిత్‌షాతో పాటు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో భేటీ అయ్యారు. అమిత్ షాతో అయితే ఏకంగా 40 నిమిషాల పాటు కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణకు వరద సాయం నిధులను మంజూరు చేయాలని కోరినట్టు తెలుస్తోంది. హైదరాబాద్‌లో వరదల వల్ల సంభవించిన నష్టం గురించి అమిత్‌షాకు సీఎం వివరించారు.
రాష్ట్రంలో కేంద్ర బృందం పర్యటించి వరద నష్టాన్ని అంచనా వేసి నెల రోజులు గడుస్తున్నా రాష్ట్రానికి నిధులు రాలేదని చెప్పినట్టు తెలుస్తోంది. కాబట్టి వీలైనంత త్వరగా అంతర్ మంత్రిత్వ శాఖల సమావేశాన్ని ఏర్పాటు చేసి జాతీయ విపత్తు నిర్వహణ నిధి కింద నిధులు విడుదల చేయాలని అమిత్‌షాను కేసీఆర్ కోరినట్లు సమాచారం. మూడు రోజుల పాటు కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో భాగంగా.. ముందుగా... కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను కలిశారు. అనంతరం అమిత్‌షాతో భేటీ అయ్యారు. కాగా.. షెకావత్‌తో భేటీలో భాగంగా.. కాళేశ్వరం మూడో టీఎంసీ విస్తరణ పనులకు అనుమతులివ్వాలని కోరారు. షెకావత్‌తో దాదాపు గంటకుపైగా కేసీఆర్ సమావేశమయ్యారు.
పర్యావరణ అనుమతులు లేనందున కాళేశ్వరం ప్రాజెక్టు మూడో టీఎంసీ పనులను నిలిపివేయాలని ఎన్జీటీ ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి గతంలో ప్రాజెక్టు పనులు నిలిపివేయాలని కేంద్ర జలశక్తి శాఖ గతంలో లేఖ రాసింది. దీంతో మూడో టీఎంసీ పనులు చేపట్టడానికి అనుమతులు ఇవ్వాలని సీఎం కేసీఆర్ కోరినట్టు తెలుస్తోంది. కాగా.. నేడు కేసీఆర్.. కేంద్ర పట్టణాభివృద్ధి, పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో సమావేశం అయ్యే అవకాశమున్నట్టు తెలుస్తోంది. కాగా.. కేసీఆర్.. ఈ పర్యటనలో కేంద్ర మంత్రులతో ఏకాంత భేటీలకే ప్రాధాన్యమిచ్చినట్టు తెలుస్తోంది. కనీసం తన వెంట ఎవరూ రావడానికి వీల్లేదని తమ పార్టీ ఎంపీలకు సూచించినట్టు సమాచారం. మొత్తానికి కేసీఆర్ అనూహ్య నిర్ణయం.. కేంద్ర మంత్రులతో భేటీ రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments