Rahul Gandhi:కేసీఆర్ రాజులా వ్యవహరిస్తున్నారు.. దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్యే ఈ ఎన్నికలు..

  • IndiaGlitz, [Thursday,October 19 2023]

తెలంగాణ ఎన్నికలు దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య జరగబోతున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు. పెద్దపల్లి జిల్లా మంథని బహిరంగ సభలో రాహుల్ మాట్లాడుతూ రాజకీయంగా పార్టీకి నష్టమని తెలిసినా సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారన్నారు. కానీ రాష్ట్రం వచ్చి పదేళ్లు గడిచినా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని రాహుల్ పేర్కొన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిలా కాకుండా రాజులా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ముఖ్య శాఖలన్నీ తన ఆధీనంలోనే ఉంచుకున్నారని విమర్శించారు. ఈ పదేళ్లలో కేసీఆర్ ఏ ఒక్క హామీనైనా నెరవేర్చారా అని ప్రశ్నించారు.

భూస్వాములకు మేలు చేసేందుకే రైతుబంధు..

డబుల్ బెడ్ రూం ఇళ్లు ఎంతమందికి ఇచ్చారని, రూ.లక్ష రుణ మాఫీ ఎంతమందికి చేశారో ప్రజలు ఆలోచించాలని కోరారు. భూస్వాములు, ధనవంతులకు మేలు చేసేందుకే రైతుబంధు తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరణి పేరుతో భూములు కంప్యూటరైజ్డ్ చేస్తున్నామని చెప్పి పేదల భూములను లాక్కున్నారని రాహుల్ ఆరోపించారు. తెలంగాణ వస్తే తనకు సంతోషంగా ఉంటుందని.. రాష్ట్రంతో తనకున్న బంధం రాజకీయ సంబంధం కాదన్నారు. దివంగత నేతలు జవహర్ లాల్ నెహ్రు, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలకు తెలంగాణతో మంచి సంబంధం ఉందని ఆయన చెప్పారు.

తెలంగాణ రాకుంటే బిచ్చం ఎత్తుకునేవాళ్లు..

ఇక ఈ సభలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఏమిచ్చినా, ఎంత చేసినా కాంగ్రెస్ కార్యకర్తల రుణం తీర్చు కోలేనిదన్నారు. ప్రజలను నట్టేట ముంచిన కేసీఆర్.. మూడో సారి ముఖ్యమంత్రి కావాలని చూస్తున్నారన్నారు. ఉద్యోగాలు రాక ఆడ బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటే అవహేళన చేస్తున్నారని ధ్వజమెత్తారు. సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకుంటే కేసీఆర్ కుటుంబం నాంపల్లి దర్గా, బిర్లా మందిర్ వద్దో బిచ్చం ఎత్తుకునేవాళ్లంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇవాళ లక్ష కోట్లు, వేలాది ఎకరాల భూములు ఎక్కడి నుంచి వచ్చాయో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాకుంటే కేటీఆర్ అమెరికాలో బాత్ రూమ్‌లు కడుక్కుని బతికేవాడివి అంటూ రేవంత్ విమర్శించారు.