కొలువుదీరిన తెలంగాణ కొత్త కేబినెట్
- IndiaGlitz, [Sunday,September 08 2019]
తెలంగాణ కేబినెట్ విస్తరణ జరిగింది. శనివారం సాయంత్రం రాజ్ భవన్లో గవర్నర్ తమిళ్ శై సౌందరరాజన్ సమక్షంలో నూతన మంత్రులు ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. తొలుత తన్నీరు హరీశ్ రావుతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం, కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణానికి ముందు కేటీఆర్, హరీశ్ ఇద్దరూ ఒకే కారులో వచ్చారు.
ప్రమాణం అనంతరం కేటీఆర్, హరీశ్ ఇద్దరూ కేసీఆర్ కాళ్లకు నమస్కరించారు. ఇదిలా ఉంటే.. కేసీఆరే స్వయంగా.. కొత్త మంత్రులకు బొకేలు అందజేశారు. అనంతరం గవర్నర్, సీఎం కేసీఆర్, మంత్రుల బృందం రాజ్భవన్లో గ్రూప్ ఫోటో దిగారు. ఈ సందర్భంగా కొత్త, పాత మంత్రులను కేసీఆర్.. గవర్నర్కు పరిచయం చేశారు. అయితే ప్రమాణం చేసిన ఈ మంత్రులకు శాఖలు ఇంకా కేటాయించలేదు. ఇవాళ సాయంత్రం.. సోమవారం మధ్యాహ్నం లోపు శాఖల కేటాయింపు ఉంటుందని సమాచారం.
తొలి మహిళా మంత్రులుగా చరిత్ర!
ఇదిలా ఉంటే.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారిగా రాష్ట్ర మంత్రివర్గంలో ఇద్దరు మహిళలకు చోటు దక్కింది. 2014–2018 మధ్యకాలంలో తెలంగాణ తొలి శాసనసభలో మహిళలకు మంత్రివర్గంలో చోటు లభించలేదు. రెండోసారి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం మంత్రివర్గంలో ఇద్దరు మహిళలకు చోటు కల్పించారు. ఈ క్రమంలో సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్లకు చోటు దక్కడంతో తొలి మహిళా మంత్రులుగా చరిత్ర సృష్టించారని చెప్పుకోవచ్చు.