KCR:తెలంగాణ నూతన సచివాలయాన్ని ప్రారంభించిన కేసీఆర్.. ఆరు కీలక ఫైళ్లపై తొలి సంతకం
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నూతన సచివాలయాన్ని ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించారు. ప్రధాన ద్వారం నుంచి యాగశాల వరకు కేసీఆర్‌కు వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన ముఖ్యమంత్రి.. రిబ్బన్ కట్ చేసి కొత్త సచివాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ముందుగా నిర్ధారించిన ముహూర్తం ప్రకారం.. మధ్యాహ్నం 1.30 గంటలకు ఆయన సచివాలయ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం 6వ అంతస్తులో వున్న తన ఛాంబర్లోకి వెళ్లి 6 కీలకమైన ఫైల్స్‌పై తొలి సంతకం చేశారు. అదే సమయంలో మంత్రులు , సీఎస్, ఇతర ఉన్నతాధికారులు వారి వారి ఛాంబర్లలో బాధ్యతలు స్వీకరించారు. దీంతో సచివాలయం ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది.
కేసీఆర్ కాళ్లు మొక్కేందుకు పోటీపడ్డ నేతలు , అధికారులు :
మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అభినందనలు తెలిపేందుకు నేతలు, అధికారులు పోటీపడ్డారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు, అధికారులు ఆయనకు పుష్పగుచ్చాలు అందజేశారు. కొందరు నేతలు కేసీఆర్‌కు పాదాభివందనం సమర్పించారు. అయితే మంత్రి కేటీఆర్ అత్యంత నిరాడంబరంగా చాంబర్లోకి ప్రవేశించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
కొందరు కారుకూతలు కూశారు :
అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ అవతరించిన తొలినాళ్లలో కొందరు కారుకూతలు కూశారని.. కానీ ఈరోజున తెలంగాణ ఆకాశమంత స్థాయికి ఎదిగిందన్నారు. సమైక్య రాష్ట్రంలో చిక్కి శల్యమైన చెరువులను బాగు చేశామన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణం జరిగిందని కేసీఆర్ గుర్తుచేశారు. ఈ వేసవిలో మొత్తం భారతదేశంలో వున్న వరి పైరు 94 లక్షలయితే.. ఇందులో ఒక్క తెలంగాణలో 56 లక్షలు పండుతోందని సీఎం తెలిపారు. రాష్ట్రంలో నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని.. ఇదీ పునర్ నిర్మాణమంటే అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. వలస పోయిన పాలమూరు కూలీలు ఒక్కొక్కరుగా తిరిగి వచ్చి తమ పొలాలను సాగు చేసుకుంటున్నారని సీఎం అన్నారు. మిషన్ భగీరథ ద్వారా హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఏ నీళ్లు ఇస్తున్నామో.. ఆదిలాబాద్ గోండు గూడెంలోనూ అదే నీరు ఇస్తున్నామని కేసీఆర్ తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments