KCR:కేసీఆర్ హ్యాట్రిక్ ఖాయమా..? కొత్త ప్రభుత్వం వస్తుందా..? తెలంగాణ ఎన్నికల్లో గెలుపు ఎవరిది..?
Send us your feedback to audioarticles@vaarta.com
కొంతకాలంగా రాష్ట్ర ప్రజలందరూ ఎదురుచూస్తున్న ఉత్కంఠకు తెరపడింది. మొత్తానికి తెలంగాణ ఎన్నికలకు సైరెన్ మోగింది. నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో రాష్ట్రంలో నేటి నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత మూడో సారి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. 2014లో జరిగిన ఎన్నికల్లో అప్పటి టీఆర్ఎస్ పార్టీ 63 స్థానాలు గెలిచి కొత్త రాష్ట్రంలో తొలిసారిగా అధికారం చేపట్టింది. కేసీఆర్ తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇక 2019లో ఎన్నికలు జరగాల్సి ఉండగా కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లడంతో 2018లోనే ఎలక్షన్స్ జరిగాయి.
2018లో విజయ దుందుభి మోగించిన టీఆర్ఎస్..
ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ సింగిల్‌గా పోటీ చేయగా.. కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ మహాకూటమిగా ఏర్పడి పోటీ చేశాయి. అయితే ఈ ఎన్నికల్లో గతంలో కంటే ఎక్కువగా టీఆర్ఎస్ ఏకంగా 87 సీట్లు గెలుచుకుని మరోసారి అధికారంలో వచ్చింది. ఇక మహాకూటమి కేవలం 22స్థానాలు మాత్రమే గెలుచుకుంది. ఇక బీజేపీ కేవలం ఒక్క స్థానానికి మాత్రమే పరిమితం కాగా.. స్వతంత్రులు రెండు స్థానాలు గెలిచారు. 2018 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ 46.87శాతం ఓట్ షేర్‌ను సాధించగా.. కాంగ్రెస్‌కు 28.43శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. కమలం పార్టీ బీజేపీ 6.98 శాతం ఓట్లతోనే సరిపెట్టుకుంది.
లోక్‌సభ ఎన్నికల్లో అనూహ్యంగా పుంజుకున్న బీజేపీ..
అయితే ఆ తర్వాత 6 నెలలకు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది. 4 ఎంపీ స్థానాలు గెలుచుకుని ఆశ్చర్యపరిచింది. కాంగ్రెస్ కూడా 3 ఎంపీ స్థానాలు కైవసం చేసుకుంది. గులాబీ పార్టీ కేవలం 9 ఎంపీ స్థానాలు మాత్రమే గెలుచుకుంది. అనంతరం జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలతో పాటు ఉప ఎన్నికల్లో కూడా బీజేపీ బలంగా పుంజుకుంంది. దుబ్బాక, హుజురాబాద్ బై ఎలక్షన్స్‌లో విజయ దుందుభి మోగించగా.. మునుగోడులో గట్టి పోటీ ఇచ్చి ఓడిపోయింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 48 స్థానాలు గెలుచుకుని గులాబీ పార్టీకి గట్టి పోటీ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ మాత్రం అన్ని ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోయింది. దీంతో తెలంగాణలో కేసీఆర్ పార్టీకి బీజేపీ మాత్రమే పోటీ ఇవ్వగలదని జనాల్లోకి బలంగా వెళ్లిపోయింది. వచ్చే ఎన్నికల్లో కాషాయ కండువా ఎగరేయడం ఖాయమని బల్లగుద్ది మరి చెప్పారు.
కాంగ్రెస్‌లో ఫుల్ జోష్ నింపిన కర్ణాటక ఎన్నికల ఫలితాలు..
అయితే కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణ బీజేపీని ఘోరంగా దెబ్బకొట్టాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించడంతో తెలంగాణ కాంగ్రెస్‌లో కూడా ఫుల్ జోష్ వచ్చింది. అప్పటి వరకు డీలా పడిన కాంగ్రెస్ క్యాడర్ కర్ణాటక ఎన్నికల ఫలితాలతో ఒక్కసారిగా యాక్టివ్ అయింది. ఇతర పార్టీల నేతలు కాంగ్రెస్‌లో చేరడానికి క్యూకట్టారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా బలం పుంజుకుంది. ఓవైపు బీజేపీకి బలం తెచ్చిన బండి సంజయ్‌ను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించి కిషన్ రెడ్డికి అప్పగించడం కూడా కమలం పార్టీకి చాలా మైనస్ అయింది. ఇదే సమయంలో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పుంజుకోవడంతో బీజేపీ పూర్తిగా వెనకంజలో పడిపోయింది.
ఎన్నికల క్షేత్రంలో ముందున్న సీఎం కేసీఆర్..
ఎన్నికల క్షేత్రంలో సీఎం కేసీఆర్ అన్ని పార్టీల కంటే ముందే ఉన్నారు. 119 స్థానాలకు గాను 115 స్థానాల్లో అభ్యర్థులను ముందుగా ప్రకటించారు. దీంతో ప్రచారంలో బీఆర్‌ఎస్ నేతలు దూసుకుపోతున్నారు. మరోవైపు కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల కసరత్తులోనే ఇంకా ఉన్నాయి. కాంగ్రెస్ ఇప్పటికే ఆరు గ్యారెంటీ స్కీమ్‌లు ప్రకటించి ఊపుమీదుంది. కాంగ్రెస్ గ్యారంటీ హామీలకు పోటీగా కేసీఆర్ మేనిఫెస్టో తయారుచేసే పనిలో ఉన్నారని గులాబీ నేతలు చెబుతున్నారు. ఈనెల 16న వరంగల్‌లో బహిరంగ సభ నిర్వహించి ప్రతిపక్షాలకు మైండ్ బ్లాక్ అయ్యేలా మేనిఫెస్టో విడుదల చేయబోతున్నారని వెల్లడిస్తున్నారు. ఇటు అభ్యర్థుల ఎంపికలో.. అటు మేనిఫెస్టోలో బీజేపీ మాత్రం డీలా పడిపోయింది.
పోటీకి సిద్ధమైన టీడీపీ, జనసేన, వైసీటీపీ..
మరోవైపు ఈ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, వైసీటీపీ కూడా పోటీ చేయనున్నాయి. దీంతో ఈ మూడు పార్టీలు ఎవరి ఓట్లు చీలుస్తాయోనన్న ఆందోళన ప్రధాన పార్టీల్లో నెలకొంది. జనసేన ఇప్పటికే 32 నియోజకవర్గాల్లో పోటీకి దిగుతామని ప్రకటించింది. ఇక టీడీపీ కూడా వీలైనంత ఎక్కువ స్థానాల్లో పోటీకి సిద్ధమవుతంది. ఇక వైఎస్ షర్మిల పార్టీ 119 స్థానాల్లో పోటీకి దిగనున్నట్లు తెలుస్తోంది. ఈ మూడు పార్టీల వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలి బీఆర్‌ఎస్‌కు లాభం చేకూరతుందా..? లేక ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలకు లబ్ధి జరుగుతుందా..? అనే టెన్షన్ నెలకొంది.
ఈసారి ఎన్నికల ఫలితాల్లో యువత ఓట్లే కీలకం..
ఈసారి తెలంగాణ ఎన్నికల్లో ఫలితాలను యువతే శాసించనున్నారు. ఓటరు జాబితా ప్రకారం కొత్తగా 7లక్షల మంది తొలిసారి ఓటు నమోదు చేసుకోగా... 35ఏళ్లలోపు ఓటర్లు 75లక్షల మంది దీంతో యువతను ఆకర్షించేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తానికి ఈ దఫా అసెంబ్లీ ఎన్నికలు మాత్రం పోటాపోటీగా జరగనున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments