తెలంగాణలో షాపులన్నీ తెరుచుకోవచ్చు.. కేసీఆర్ గ్రీన్ సిగ్నల్
- IndiaGlitz, [Monday,May 18 2020]
తెలంగాణలో కూడా మే-31 వరకు లాక్ డౌన్ ఉంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. ఇవాళ సుధీర్ఘ కేబినెట్ భేటీ అనంతరం ప్రగతి భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన వివరాలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఏమేం తెరుచుకోవచ్చు..? ఏయే ఏరియాల్లో ఏమేం తెరవాలి..? వేటికి బంద్ ఉంటుందనే విషయాలను కేసీఆర్ నిశితంగా వివరించారు. కంటైన్మెంట్ ఏరియాలను తప్ప అన్ని జోన్లను గ్రీన్ జోన్లుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ కంటైన్ ఏరియాల్లో 1452 కుటుంబాలు ఉన్నాయి. ఇది రెడ్ జోన్, హాట్ స్పాట్ ఏరియా కింద ఉంటుంది. ఈ ఏరియాలో పోలీసుల పహారా స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఆ ఏరియా వారిని బయటికి.. బయట్నుంచి వచ్చినవారిని ఆ ఏరియాలోకి రానివ్వరు. ఇది నగర భవిష్యత్ గనుక అందరూ సహకరించాలని ఈ సందర్భంగా కేసీఆర్ విజ్ఙప్తి చేశారు.
కరోనాతో కలిసి.. బతుకు కొనసాగాల్సిందే..
ప్రపంచం మొత్తం కరోనాకు మందు లేదా వ్యా్క్సిన్ వచ్చే ప్రసక్తే లేదని.. ఇది ఎన్ని మాసాలు కొనసాగుతుందో తెలియని పరిస్థితి అని చెబుతున్నారు. ఇది ఎన్ని రోజులు ఉంటుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రపంచం, దేశం ముందు.. రాష్ట్రం ముందు ఉన్నది ఒక్కటే ‘కరోనా కలిసి జీవించాల్సిందే.. మనకు గత్యంతరం లేదు.. బతుకుదెరువు ఉంటుంది కాబట్టి కంబైండ్‌గా పోవాల్సిందే’ అని కేసీఆర్ ప్రకటించారు. బతుకు కొనసాగాల్సిందే తప్ప బతుకును బంద్ పెట్టుకుని ఇంకా అనేక మాసాలు కూర్చోలేమని అందుకే రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుందని ఆయన తెలిపారు.
వీటికి మాత్రమే అనుమతి..
రాష్ట్రంలో హైదరాబాద్ (కంటైన్మెంట్ ఏరియా) తప్ప మిగితా అన్ని చోట్లా అన్నిరకాల షాపులు తెరుచుకోవచ్చు. ఇప్పటి వరకూ మున్సిపాలిటిల్లో సగం సగం మాత్రమే ఉండేది ఇప్పుడిక అందరూ అన్ని షాపులు తెరుచుకోవచ్చు. వ్యాపారాలు సజావుగా చేసుకోవచ్చు. హైదరాబాద్ వరకు మాత్రమే జీహెచ్ఎంసీ కమిషనర్ నిర్ణయం చేసి ప్రకటిస్తారు. నగరంలో ఆల్టర్‌నేటివ్ షాపులు మాత్రం తెరుచుకోవచ్చు. కంటైన్మెంట్ ఏరియాల్లో ఏవీ తెరవడానికి వీల్లేదు.. అస్సలు అనుమతిలేదు. కంటైన్డ్ కాని ఏరియాలో అన్ని షాపులు తెరుచుకోవచ్చు’ అని కేసీఆర్ ఈ సందర్భంగా తెలిపారు.