కేసీఆర్ కీలక నిర్ణయం.. మార్చి 31 వరకు తెలంగాణ లాక్డౌన్
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా మహమ్మారి రోజురోజుకీ ఉద్ధృత రూపం దాల్చుతున్న తరుణంలో.. వ్యాప్తిని నిరోధించడానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 31 వరకు తెలంగాణ రాష్ట్రాన్ని లాక్ డౌన్ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. తొలుత అధికారులు, మంత్రులతో నిర్వహించిన అత్యున్నత సమావేశంలో ముఖ్యమంత్రి ఈ అంశంపైనే చర్చించి నిర్ణయం తీసుకున్నారు.జనతా కర్ఫ్యూ ఈ రోజు పాటించినట్లుగా మార్చి 31 వరకు తెలంగాణ ప్రజలంతా ఇళ్లకు పరిమితమైతే కరోనా వైరస్‌పై విజయం సాధించవచ్చని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
ఉచితంగా బియ్యం!
‘తెలంగాణలో కొత్తగా 5 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిత్యవసర వస్తువులు తెచ్చుకోవడానికి కుటుంబానికి ఒకరిని మాత్రమే అనుమతిస్తారు. నిత్యవసర వస్తువులు తెచ్చుకున్నప్పుడు రెండుమూడు రోజులకు సరిపడేలా ఒకేసారి తెచ్చుకోవాలి.
87.59 లక్షల మంది తెల్ల రేషన్ కార్డుదారుల కుటుంబాలకు మనిషికి 12 కేజీల చొప్పున వీలైనంత త్వరగా బియ్యం అందిస్తాం.
రూ.1103 కోట్ల విలువైన 3,36,000 టన్నుల పైచిలుకు బియ్యం వీరికి ఉచితంగా పంపిణీ చేస్తాం. నిత్యవసరాలు కొనుగోలు చేయడానికి వీలుగా రేషన్ కార్డుదారులందరికీ రూ.1500 చొప్పున నగదు అందిస్తాం. రూ. 1314 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఈ నిధులన్నీ తక్షణం ప్రభుత్వం విడుదల చేస్తుంది’ అని కేసీఆర్ తెలిపారు.
జీతాలివ్వండి!
‘అత్యవసర సర్వీసుల ఉద్యోగులు తప్ప మిగతా అన్ని శాఖల వారు 20 శాతం ఉద్యోగులు హాజరవుతారు. రొటేషన్‌పై పనిచేస్తారు. ప్రయివేటు ఉద్యోగులు, కార్మికులకు యాజమాన్యాలు జీతాలు చెల్లించాలి. అంటురోగాల నివారణ చట్టం ప్రకారం ఈ లాక్డౌన్ కాలంలో కూడా ప్రయివేటు ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులు, ప్రయివేటు ఉద్యోగులు, కార్మికులు అందరికీ యాజమాన్యాలు జీతాలు చెల్లించాలి.అంగన్వాడీ కేంద్రాలు మూసివేస్తున్నామని.. అయితే, పిల్లలకు ఇబ్బందులు లేకుండా వారికి సరకులు అందించే ప్రయత్నం చేస్తున్నాం.
ఈ నెల, వచ్చే నెలలో ప్రసవించాల్సిన గర్భిణుల వివరాలు సేకరిస్తున్నాం. వారికి ఆసుపత్రులకు తేవడం, కాన్పులు చేయించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం’ అని కేసీఆర్ స్పష్టం చేశారు.
ప్రజా రవాణా బంద్
ప్రజారవాణా పూర్తిగా మూసివేస్తున్నాం. బస్సులు, ఆటోలు, ట్యాక్సీలు అన్ని సర్వీసులు నిలిపివేస్తున్నాం. ఆర్టీసీ బస్సులు, ఆటోలు, ట్యాక్సీలు బంద్ కానున్నాయి. ప్యాసింజర్ సర్వీసులు, ప్రైవేట్ బస్సులు కూడా బంద్ చేస్తాం. దీన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు.
ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి ప్రజలంతా స్వీయ నియంత్రణలు పాటించాలి. మనల్ని మనం రక్షించుకోవడానికి సమాజమంతా ఏకం కావాలి. ప్రతి ఒక్కరూ ఇళ్లకు పరిమితం కావాలి. తెలంగాణకు మిగతా రాష్ట్రాలతో ఉన్న సరిహద్దులన్నీ మూసివేస్తున్నాం’ అని కేసీఆర్ తెలిపారు.
ఒకరికి మాత్రమే..
నిత్యవసర, అత్యవసర సరకులు తెచ్చే వాహనాలను మాత్రమే అనుమతిస్తారు. ఇటలీకి పట్టిన గతి మనకు పట్టొద్దంటే స్వీయ నియంత్రణ పాటించాలి. విదేశాల నుంచి వచ్చిన వారు అధికారులకు రిపోర్ట్ చేయండి. ఇంట్లోంచి ఎవరూ బయటికి రావొద్దు.. సెలవులు ప్రకటించింది బయట తిరగడానికి కాదు. కూరగాయలు, పాలు, కిరాణాషాపులు తెరిచే ఉంటాయి’. అని కేసీఆర్ తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com