KCR :అధికారంపై కేసీఆర్ ధీమా.. డిసెంబర్ 4న కేబినెట్ భేటీకి నిర్ణయం..
- IndiaGlitz, [Friday,December 01 2023]
తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సోమవారం మంత్రివర్గ సమావేశానికి సిద్ధమయ్యారు రాష్ట్ర సచివాలయంలో కేసీఆర్ అధ్యక్షతన డిసెంబర్ 4వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ భేటీ జరగనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
రాష్ట్రంలో మళ్లీ అధికారంపై గులాబీ బాస్ ధీమా వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రగతిభవన్‌లో కేసీఆర్‌ని దాదాపు 25మంది నేతలు కలిశారని సమాచారం. పోలింగ్ సరళి, గెలుపు అవకాశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలను కేసీఆర్ కొట్టిపారేశారని.. ఆగంకావద్దు.. పరేషాన్ అవ్వొద్దు అంటూ కేసీఆర్ నేతలకు భరోసా ఇచ్చారని తెలుస్తోంది. రెండు రోజులు నిమ్మలంగా ఉండండి.. ఎగ్జాక్ట్ పోల్స్ వస్తాయని.. ఆదివారం సంబరాలు చేసుకుందామని నాయకులకు కేసీఆర్ చెప్పారట. ఈ క్రమంలోనే ప్రగతిభవన్ నుంచి పలువురు నేతలు వెళ్తూ విక్టరీ సింబల్ చూపించారు.
మరోవైపు చాలాకాలం తర్వాత గురువారం రాత్రి ప్రశాంతంగా నిద్రపోయానని మంత్రి KTR ట్వీట్ చేశారు. ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలు అతిశయోక్తిగా ఉన్నాయన్న కేటీఆర్.. ఎగ్జాట్ పోల్స్‌లో తమకు శుభవార్త చెబుతాయని తెలిపారు.
ఇక రాష్ట్రవ్యాప్తంగా 70.79% పోలింగ్ నమోదైందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్ తెలిపారు. అయితే 2018 ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోలింగ్ మూడు శాతం తగ్గిందని పేర్కొ్‌న్నారు. అలాగే రాష్ట్రంలో రీపోలింగ్‌కు అవకాశం లేదని స్పష్టం చేశారు. ఇక డిసెంబర్ 3న జరిగే ఓట్ల లెక్కింపు కోసం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మొత్తం 49 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ఉంటుందని.. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుందన్నారు. తొలుత పోస్టల్ ఓట్లు లెక్కిస్తామని.. 8.30గంటల నుంచి ఈవీఎంల లెక్కింపు చేపడతామన్నారు. ఉదయం 10గంటలకు తొలి ఫలితం వచ్చే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 90.03%, అత్యల్పంగా హైదరాబాద్‌లో 46.56% పోలింగ్ నమోదైందని చెప్పారు.