KCR :మళ్లీ జగనే గెలుస్తారంటున్న కేసీఆర్ వ్యాఖ్యలను ఎలా చూడాలి..? వైసీపీ, టీడీపీ రియాక్షన్ ఏంటి..?
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీలో ఎన్నికల సమరం తీవ్ర స్థాయిలో జరుగుతోంది. మరో 20 రోజులు మాత్రమే పోలింగ్‌కు సమయం ఉండటంతో నువ్వానేనా రీతిలో అధికార, ప్రతిపక్ష నేతలు ఢీకొంటున్నారు. దీంతో ఈసారి విజయం ఎవరిని వరిస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలో తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏపీలో ఏ పార్టీ విజయం సాధిస్తుందో చెప్పారు. తాజాగా ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు ఉన్న సమాచారం మేరకు ఏపీలో మళ్లీ జగనే అధికారంలోకి వస్తారని తెలిపారు. ఇదే కాకుండా తెలంగాణలోని అనేక అంశాలపై కేసీఆర్ తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. తన రాజకీయ వారసుడు ఎవరో చెప్పలేనని.. పార్టీ పేరు టీఆర్ఎస్‌గా మార్చడం ఇప్పట్లో కుదరదని.. లిక్కర్ కేసులో కవితను అక్రమంగా చేశారంటూ తనదైన శైలిలో చెప్పుకొచ్చారు.
ఇక ఏపీ ఎన్నికల విషయానికొస్తే అక్కడ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తమకు ఒరిగేదీ ఏం లేదని.. ప్రస్తుతానికి ఏపీ ఎన్నికల్లో జోక్యం చేసుకోమన్నారు. భవిష్యత్తులో కచ్చితంగా ఏపీ రాజకీయాల్లోకి అడుగుపెడతామని వ్యాఖ్యానించారు. దీంతో కేసీఆర్ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. దీంతో కేసీఆర్ వ్యాఖ్యలపై టీడీపీ కూటమి, వైసీపీ శ్రేణులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. వైసీపీ క్యాడర్ అయితే తమ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తుందని చెప్పేందుకు కేసీఆర్ వ్యాఖ్యలే నిదర్శనమని చెబుతున్నారు. ఏపీలో ఇప్పటికీ కేసీఆర్ అంటే అభిమానం ఉన్నవాళ్లు ఎక్కువ మందే ఉన్నారని పేర్కొంటున్నారు. ప్రధానంగా తటస్థ, సైలెంట్ ఓటర్లు కేసీఆర్ వ్యాఖ్యలతో తమ వైపు చూసే అవకాశముందని నమ్ముతున్నారు.
మరోవైపు టీడీపీ మద్దతుదారులు మాత్రం కేసీఆర్ కామెంట్స్‌తో ఆశ్చర్యపడాల్సింది ఏమి లేదంటున్నారు. ఎందుకంటే కేసీఆర్, జగన్ మధ్య సన్నిహిత సంబంధాలు అందరికీ తెలిసిందే అని గుర్తుచేస్తున్నారు. 2019 ఎన్నికల సమయంలో జగన్ గెలిచేందుకు కేసీఆర్ పరోక్షంగా సహకరించారనే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. అలాగే జగన్ అధికారంలోకి వచ్చాక కేసీఆర్ ఇంటికి వెళ్లి ఆయనకు ధన్యవాదాలు చెప్పారు కదా అని ప్రశ్నిస్తున్నారు. గతంలోనూ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏపీకి రావాల్సిన ఆస్తుల విషయంలో జగన్ ఉదాసీనంగా వ్యవహరించారని ఆరోపిస్తున్నారు. అలాంటప్పుడు జగన్‌కు మద్దతుగా మాట్లాడకుండా ఎలా ఉంటారని చెప్పుకొస్తున్నారు.
తమ అధినేత చంద్రబాబు అంటే ఫస్ట్ నుంచి కేసీఆర్‌కు పడదని.. చంద్రబాబును మీడియా సమావేశాల్లో కేసీఆర్ విమర్శలు చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. కేసీఆర్ ఎప్పుడూ జగన్ పక్షమే అంటున్నారు. చంద్రబాబును స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ చేసినప్పుడు హైదరాబాద్‌లో ఆందోళనలు చేయకుండా అడ్డుకోలేదా అని నిలదీస్తున్నారు. అంతేకాకుండా గతేడాది తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోతుంటే.. అంచనా వేయలేకపోయిన కేసీఆర్.. ఏపీలో ఎవరు అధికారంలోకి వస్తారో అంచనా వేస్తారా అంటూ సెటైర్లు వేస్తున్నారు.
ఇదిలా ఉంటే కేసీఆర్ మాటలు ఎంత వరకు నిజమవుతాయో కాదో ఇప్పుడే చెప్పలేం. ఎందుకంటే 2014లో ఎన్నికలు ముగియగానే తెలంగాణలో తాము అధికారంలోకి వస్తున్నామని.. ఏపీలో వంద సీట్లలో జగన్ గెలవబోతున్నారని చెప్పారు. కానీ ఏపీలో తెలుగుదేశం-బీజేపీ-జనసేన కూటమి విజయం సాధించింది. ఇప్పుడు కూడా జగన్ అధికారంలోకి వస్తారని చెబుతున్నారు.. మరోవైపు 2014 ఎన్నికల్లాగే టీడీపీ కూటమిగా బరిలో దిగింది. దీంతో కేసీఆర్ అంచనాలు నిజమవుతాయో లేదంటే 2014 ఎన్నికల సీన్ రిపీట్ అవుతుందో తెలియాలంటే జూన్ 4వరకు ఆగాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments