తల్చుకుంటే దుమ్ము దుమ్ము... నశం కింద కొడతా: కేసీఆర్
- IndiaGlitz, [Sunday,November 29 2020]
జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ ఎల్బీస్టేడియంలో నేడు భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభకు సీఎం కేసీఆర్తో పాటు మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు. తనను రారా పోరా అంటున్నావని.. అయినప్పటికీ తాను మాట్లాడటం లేదన్నారు. తాను తలచుకుంటే దుమ్ము దుమ్ము.. నశం కింద కొడతానని కేసీఆర్ హెచ్చరించారు. తమకు బాసులు ప్రజలేనని.. ఢిల్లీలో ఉండరని వ్యాఖ్యానించారు.
మీ చిల్లర మాటలకు ఏమాత్రం టెమ్ట్ కాబోమని కేసీఆర్ తెలిపారు. తమకు 60 లక్షల మంది కార్యకర్తలున్నారన్నారు. అయినప్పటికీ తాము టెమ్ట్ కావడం లేదన్నారు. గతంలో కంటే ఈసారి తమకు నాలుగు సీట్లు ఎక్కువే వస్తాయన్నారు. గెలిచిన తరువాత నూతన జవసత్వాలతో మళ్లీ మొదలు పెడతామని కేసీఆర్ తెలిపారు. ఎన్నికల్లో పిచ్చి ఆవేశాలకు పోవద్దని.. రెచ్చగొట్టే మాటలకు లొంగవద్దని.. తెలంగాణ కుటుంబ పెద్దగా విజ్ఞప్తి చేస్తున్నానని కేసీఆర్ తెలిపారు.
భూముల రేట్లు పడిపోతాయని.. ఆస్తుల ధరలు పడిపోతాయని భయపడవద్దన్నారు. మంచి అభ్యర్థులను పెట్టామని గెలిపించాలని కోరారు. ఏకపక్షంగా ఇంకో 5 సీట్లు ఎక్కువ ఇచ్చి ఆశీర్వదించాలన్నారు. వెకిలి మాటలు.. సమాజాన్ని విభజించే మాటలకు లొంగవద్దని కేసీఆర్ సూచించారు. హైదరాబాద్ మీది.. దీన్ని యువత కాపాడుకోవాలి అని సూచించారు. హైదరాబాద్లో ఉన్న ప్రతి బిడ్డా.. మా బిడ్డే. ఎక్కడా కుల, మత, ప్రాంతీయ వివక్షలు లేకుండా ముందుకెళతామని కేసీఆర్ వెల్లడించారు.