KCR:కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో కలిపేద్దాం.. జనగామ సభలో ప్రజలకు కేసీఆర్ పిలుపు
Send us your feedback to audioarticles@vaarta.com
ధరణి పోర్టల్‌ను తీసేయాలని కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తోందని సీఎం కేసీఆర్ ఆరోపించారు. వ్యవసాయానికి 3గంటల కరెంట్ చాలని చెబుతున్న కాంగ్రెస్‌ను బంగాళాఖాతంలో కలిపేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు. జనగామలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్ జిల్లాకు పలు వరాలు ప్రకటించారు. బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డిని గెలిపిస్తే చేర్యాలను రెవెన్యూ డివిజన్ చేస్తామని హామీ ఇచ్చారు. మూడోసారి బీఆర్ఎస్ ప్రభత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే చేర్యాలను రెవెన్యూ డివిజన్‌గా చేస్తామని తెలిపారు. అలాగే జనగామలో మెడికల్ కాలేజీతో పాటు నర్సింగ్, పారా మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
కొన్ని జిల్లాలకు వెళ్తే కళ్ల వెంట నీళ్లు వచ్చేవి..
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు కొన్ని జిల్లాలకు వెళ్తే కళ్ల వెంట నీళ్లు వచ్చేవని.. అప్పడు జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాల పరిస్థితి చూస్తే ఏడుపొచ్చేదని కేసీఆర్ చెప్పుకొచ్చారు. తెలంగాణ ఏర్పడ్డాక ఎలా అభివృద్ధి చేసుకున్నామో అందరూ కళ్లారా చూశారన్నారు. హైదరాబాద్‌కు సమీపంలో ఉన్నందున జనగామ భవిష్యత్‌లో ఐటీ, పారిశ్రామిక రంగాల్లో అభివృద్ధి చెండానికి అవకాశం ఉందన్నారు. రాష్ట్రం ఏర్పాటయ్యాక పలు రంగాల్లో తెలంగాణను అభివృద్ధి బాట పట్టించామని.. ధాన్యం ఉత్పత్తిలో దేశంలో పలు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచామని వెల్లడించారు.
ప్రజలు ఓటుతో వారికి బుద్ధి చెప్పాలి..
ఎన్నికలు రాగానే కొంతమంది నోటికి వచ్చినట్టుగా మాట్లాడి వెళ్లిపోతారని.. ఎన్నికలప్పుడు వచ్చి ఆపద మొక్కులు మెుక్కే వారిని నమ్మొద్దని ఆయన ప్రజలకు సూచించారు. ఎన్నికల సమయంలో చాలా అప్రమత్తంగా వ్యవహరించాలని.. ప్రజా సమస్యలు పరిష్కరించే వారికే ఓటు వేయాలని కోరారు. పేద ప్రజల కోసం తమ మేనిఫెస్టోలో అనేక అంశాలు చేర్చినట్టుగా కేసీఆర్ గుర్తుచేశారు. తమ ప్రభుత్వం ఉండటం వల్లే మత కల్లోహాలు లేకుండా శాంతిభద్రతలు బాగున్నాయని.. కొందరు వచ్చి మతం పేరుతో విబేధాలు సృష్టించాలని చూస్తున్నారని పరోక్షంగా బీజేపీపై విమర్శలు చేశారు.
పొన్నాలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కేసీఆర్..
అంతకుముందు బహిరం సభలో సీఎం కేసీఆర్ మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పొన్నాల మాట్లాడుతూ 45 ఏళ్ల పాటు పార్టీకి సేవ చేసిన తనను కాంగ్రెస్‌లో అవమానించారన్నారు. ముఖ్యమంత్రి అయిన మూడేళ్లకే కేసీఆర్ కులగణన, సమగ్ర సర్వే చేయించారని.. ఇప్పుడు అన్ని పార్టీలు దాని ఆధారంగానే ఎన్నికలకు వెళ్తున్నాయన్నారు. అణగారిన వర్గాలకు న్యాయం చేసిన ఏకైక సీఎం కేసీఆర్ అన్నారు. జనగామ అభివృద్ధి కోసం తాను బీఆర్ఎస్‌లో చేరినట్లు పొన్నాల వెల్లడించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com