కేసీఆర్ కేబినెట్ రెడీ.. ఇదిగో మంత్రుల వివరాలు!?
- IndiaGlitz, [Monday,January 14 2019]
తెలంగాణ ఎన్నికల ఫలితాలొచ్చి నెలరోజులు దాటిపోయింది..? సీఎంగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసేశారు..? కానీ కేబినెట్ మాత్రం ఏర్పాటు చేయలేదు..? అసలు ఆయన ఎందుకు కేబినెట్ ఏర్పాటుపై ఇంత లేటు చేస్తున్నారు..? హండ్రెడ్ ‘కారు’ వేగంతో మహాకూటమిని తీవ్రంగా గాయపరిచిన కేసీఆర్.. కేబినెట్ విస్తరణలో మాత్రం తిన్నగా 10 స్పీడ్‌తో కారును ఎందుకు నడిపిస్తున్నారు..? ఇప్పటికే ఏ శాఖ ఎవరికివ్వాలనే జాబితా సిద్ధమైపోయిందా..? త్వరలోనే ప్రకటన ఉంటుందా..? అనే విషయాలు ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
ఇదేం న్యాయం సారూ..!
ఫలితాలు వచ్చిన కొద్దిరోజులకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్‌ను ప్రకటించిన కేసీఆర్.. మంత్రివర్గ విస్తరణలో ఆ తొందర కనపడట్లేదు. ఎందుకా అని ఆరాతీయగా అందుకు సరైన ముహూర్తాల్లేవని.. అందుకే మంచిరోజు కోసం వేయి కళ్లతో వేచి చూస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే పలువురు వేద పండితులను సంప్రదించిన కేసీఆర్.. కొద్దిరోజులు ఆగాలని సూచించారట. అందుకే ఆయన ఇలా నాన్చుతున్నారట.
కసరత్తులయ్యాయా..!?
ఎవరెవరికి ఏ శాఖలు ఇవ్వాలి..? పాత కేబినెట్‌లోని వారిలో ఎంతమందికి అవకాశమివ్వాలి..? ఇచ్చిన శాఖను గతంలో సక్సెస్‌గా నడిపిందెవరు..? కొత్తగా ఎవరెవరికి అవకాశమివ్వాలి..? అనే విషయాలపై ఇప్పటికే కేటీఆర్, హరీశ్, కేకేతో పాటు పలువురు పెద్దలతో కేసీఆర్ చర్చించినట్లుగా తెలుస్తోంది. మరీ ముఖ్యంగా ఇటీవల గెలిచిన శాసనసభ్యుల విద్యార్హతలు.. గతంలో వారి పనితీరు వంటి అంశాలపై పూర్తిస్థాయి నివేదికలు తెప్పించుకుని మరీ ప్లాన్ చేస్తున్నారని టాక్. ఈ నివేదికల ఆధారంగానే శాసనసభ్యుల్లో కొందరికి మంత్రి పదవులు కట్టబెడతారని సమాచారం. ఈ వ్యవహారాలన్నీ కేటీఆర్ దగ్గరుండి చూస్కుంటున్నారని తెలుస్తోంది.
కేటీఆర్ కరుణ ఎవరికి దక్కుతుందో..?
2014 ఎన్నికల్లోనే పలువురికి దగ్గరుండి మంత్రి పదవులు ఇప్పించిన కేటీఆర్.. మరోసారి జాబితా సిద్ధం చేశారని.. అయితే ఆ జాబితాలో ఎవరి పేర్లున్నాయోనని పార్టీ నేతలు ప్రకటన కోసం వేయి కళ్లతో వేచి చూస్తున్నారట. ఈ జాబితాలో ఎక్కువ మంది యంగర్స్‌కు, చదువుకున్న వారికే ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే కేటీఆర్ కరుణ ఎవరికి దక్కుతుందో.. ఏంటో తెలియాలంటే కొద్ది రోజులు ఆగక తప్పదు మరి.
అన్నీ అనుకున్నట్లు జరిగితే ఆ రోజే..!
సంక్రాంతి అనంతరం మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ప్రచారం జరుగుతున్నా .. ముహుర్తాలు సరిగ్గా లేవు.. తొందరేముంది రెండ్రోజులు ఆగితే ఏమవుద్ది ఆగలేరా..? అని పార్టీ కీలక నేతలకు కేసీఆర్ చురకలంటించారట. ఇప్పటికే మనపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయని అని బాస్‌తో పలువురు చెప్పేందుకు యత్నించగా.. మనకు ప్రతిపక్షం కూడా ఒకటుందా..? అంటూ సెటైర్లేశారట గులాబీ బాస్. అయితే అన్నీ అనుకున్నట్లు జరిగితే ఫిబ్రవరి మొదటి వారంలో ప్రమాణ స్వీకారాలు ఉంటాయని సమాచారం.
తెరాస తలుపులు తెరిచే ఉన్నాయ్..!
ఇప్పటికే పలువురు ఇతర పార్టీల నేతలు కారెక్కిన సంగతి తెలిసిందే. అయితే త్వరలోనే మరికొందరు పార్టీలో చేరతారనే తెలంగాణ రాష్ట్ర సమితి తలుపులు తెరిచే ఉంచిది. ఇటీవల కాంగ్రెస్ కీలక నేత, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పార్టీలో చేరతారనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఈ వార్తలపై ఇంత వరకూ ఆమె స్పందించనే లేదు. దీంతో ఇలాంటి వాళ్లు రావడానికి సిద్ధంగా ఉన్నారని తెలుసుకున్న టీఆర్ఎస్ అధిష్టానం ఆ శుభ సందర్భం కోసం వేచి చూస్తోందట.
జాబితాలోని మంత్రులు.. వీళ్లే..!?
(1) కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు: తెలంగాణ ముఖ్యమంత్రి (కీలక శాఖలు తీసుకునే అవకాశం)
(2) కడియం శ్రీహరి: డిప్యూటీ సీఎం, విద్యాశాఖ
(3) మహమూద్ అలీ: రెవెన్యూ (ఇప్పటికే హోం శాఖ ఇచ్చారు)
(4) ఈటెల రాజేందర్: ఆర్థిక శాఖ
(5) నిరంజన్ రెడ్డి : (ఫైనల్ చేయలేదు)
(6) కేటీఆర్: ఐటీ, పంచాయితీ రాజ్ శాఖ
(7) హరీశ్ రావు: నీటి పారుదల
(8) జగదీశ్వర్ రెడ్డి: విద్యుత్ శాఖ
(9) పువ్వాడ అజయ్: రోడ్డు,భవనాల శాఖ
(10) పద్మారావ్ : రవాణా శాఖ
(11) తలసాని శ్రీనివాస్ యాదవ్: ఎక్సైజ్ శాఖ
(12)పోచారం శ్రీనివాస్ రెడ్డి: వ్యవసాయ శాఖ
(13) జోగు రామన్న: అటవీ శాఖ
(14) కొప్పుల ఈశ్వర్: సాంఘిక సంక్షేమ శాఖ
(15) దానం నాగేందర్: పట్టణాభివృద్ధి, మున్సిపల్ శాఖ
(16) ఇంద్రకరణ్ రెడ్డి : దేవాదాయ శాఖ
(17) బాల్క సుమన్: క్రీడా శాఖ
(18) సీహెచ్ మల్లారెడ్డి: ఆరోగ్య శాఖ
(19) నరేందర్ రెడ్డి: (పట్నం మహేందర్ రెడ్డి పాత శాఖ ఇచ్చే అవకాశాలున్నాయ్). వీటిలో కొంత మంది పాత కేబినెట్‌లోని వారే ఉన్నా.. యంగర్స్‌కు ప్రాధాన్యమిచ్చారనే చెప్పుకోవచ్చు. అయితే మరో రెండు శాఖలతో పాటు స్పీకర్ పదవి కూడా మహిళలకే ఉంటుందని టాక్. అయితే ఇది ఎంత వరకు నిజమవుతుంది..? ఎప్పుడు క్లారిటీ వస్తుంది..? అనే విషయాలు తెలియాలంటే ప్రమాణ స్వీకారం వరకు వేచి చూడాల్సిందే మరి.