BRS LP నేతగా కేసీఆర్.. అసెంబ్లీని బహిష్కరించిన బీజేపీ..
- IndiaGlitz, [Saturday,December 09 2023]
బీఆర్ఎస్ శాసనసభా పక్ష నేతగా ఆ పార్టీ అధినేత, మాజీ సీఎ కేసీఆర్ ఎంపికయ్యారు. తెలంగాణ భవన్‌లో సీనియర్ నేత కేశవరావు అధ్యక్షతన కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఈ మేరకు తీర్మానం చేశారు. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి BRSLP నేతగా కేసీఆర్ పేరును ప్రతిపాదించగా మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, కడియం శ్రీహరి బలపరిచారు. అలాగే శాసనా సభాపక్షం మిగతా కమిటీని ఎంపిక చేసే బాధ్యతను కూడా కేసీఆర్‌కు అప్పగిస్తూ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యేలందరూ అసెంబ్లీకి బయలుదేరి వెళ్లారు. ఎన్నికల్లో 39 స్థానాలను గెలుచుకున్న బీఆర్ఎస్ ప్రతిపక్ష హోదాలో నిలిచింది.
ఇక బీజేపీ ఎమ్మెల్యేలు తొలిరోజు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించారు. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీని ప్రొటెం స్పీకర్‌గా ఎంపిక చేయడంతో ఆయన ముందు ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయమని తెలిపారు. ఈ మేరకు నూతనంగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలతో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. అనంతరం చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని ఎమ్మెల్యేలంతా దర్శించుకున్నారు. రెగ్యులర్ స్పీకర్ వచ్చాకే ప్రమాణం చేస్తామని తేల్చిచెప్పారు.
కాంగ్రెస్, మజ్లిస్ పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని కిషన్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మినా.. దగ్గినా పడిపోతుంది అందుకే మజ్లిస్‌ను మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. అందులో భాగంగానే ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఒవైసీని చేశారన్నారు. సీనియర్ ఎమ్మెల్యేలను కాదని ఏ ప్రాతిపదికన ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్‌ను చేశారని ప్రశ్నించారు. రెగ్యులర్ స్పీకర్ ఎన్నిక తరువాతే తమ ఎమ్మెల్యేలు ప్రమాణం చేస్తారని ఆయన స్పష్టంచేశారు.