ఒక్కో అమరవీరుడి కుటుంబానికి 25 లక్షలు: కేసీఆర్
- IndiaGlitz, [Friday,February 22 2019]
పుల్వామా ఉగ్రదాడిలో వీరమరణం పొందిన 42 మంది సీఆర్ఫీఎప్ కుటుంబాలను ఆదుకునేందుకు టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ముందుకొచ్చారు. శుక్రవారం అసెంబ్లీ వేదికగా ఉగ్రమూకల దాడిలో అమరులైన కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 25 లక్షల చొప్పున ఆర్ధికసాయం ఇస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ నుంచి వీరమరణం పొందిన సైనికుల్లో ఒక్క జవాను లేకపోయినా దేశంకోసం భారత జవాన్ల కోసం అందరికీ ఎక్స్‌గ్రేషియా ప్రకటించి గులాబీ బాస్ తన ఉదారతను చాటుకున్నారు. కేసీఆర్ నిర్ణయాన్ని యావత్ దేశం మెచ్చుకుంటోంది.
శుక్రవారం అసెంబ్లీ ప్రారంభం కాగానే మొదట అమర జవాన్లకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన పుల్వామా ఉగ్రదాడి అత్యంత దారుణమైనదని వ్యాఖ్యానించారు. అనంతరం ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నట్లు ప్రకటించారు. అమరుల కుటుంబానికి యావత్ దేశంగా అండగా ఉంటుందని, అన్ని కుటుంబాలకు పైన చెప్పిన పరిహారం అందజేస్తామని కేసీఆర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కాగా.. రూ. 1,82,017 కోట్లతో ఓటాన్ అకౌంట్‌తో గులాబీ అధిపతి బడ్జెట్ ప్రవేశపెట్టారు.