KCR:వరంగల్ ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన కేసీఆర్

  • IndiaGlitz, [Friday,April 12 2024]

వరంగల్ ఎంపీ అభ్యర్థిని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ ఉద్యమకారుడు మారేపల్లి సుధీర్‌ కుమార్‌ను ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేసినట్టు పార్టీ ప్రకటన విడుదల చేసింది. పార్టీ నేతలతో చర్చించిన అనంతరం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. 2001 నుండి తెలంగాణ ఉద్యమకారుడిగా, పార్టీకి విధేయుడిగా పనిచేస్తున్న సుధీర్ కుమార్ సరైన అభ్యర్థి అని ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ ముఖ్యనేతలు పేర్కొన్నారు. దీంతో ఆయన పేరును ఖరారుచేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మాదిగ సామాజిక వ‌ర్గానికి చెందిన సుధీర్‌ ప్రస్తుతం హనుమకొండ జడ్పీ ఛైర్మన్‌గా ఉన్నారు.

అయితే అంతకుముందు మాజీ మంత్రి తాటికొండ రాజయ్యను వరంగల్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరిగింది. పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న కడియం కుటుంబానికి చెక్ పెట్టాలంటే రాజయ్య చేత పోటీ చేయించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఫామ్‌హౌస్‌లో రాజయ్యతో కేసీఆర్‌ చర్చలు కూడా జరిపారు. అయితే ఆయన పోటీకి నిరాకరించినట్లు తెలుస్తోంది. దీంతో మరోసారి పార్టీ నేతలతో చర్చించిన అనంతరం సుధీర్ కుమార్‌ను ఎంపిక చేశారు.

కాగా అసెంబ్లీ ఎన్నికల సమయంలో సిట్టింగ్ ఎమ్మెలేగా ఉన్న రాజయ్యపై బహిరంగంగానే సంచలన ఆరోపణలు చేసి స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే టికెట్‌ను కడియం దక్కించుకున్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత, తన కుమార్తెకు కూడా ఎంపీ టికెట్ రాబట్టుకున్నారు. దీంతో తీవ్ర అసంతృప్తిగా గురైన రాజయ్య పార్టీకి రాజీనామా చేశారు. కేసీఅర్ విధి విధానాలు నచ్చకపోవడంతో పాటు పార్టీలో మాదిగలకు అన్యాయం జరుగుతుందని విమర్శలు చేశారు. అయితే కాంగ్రెస్‌ పార్టీలో చేరడానికి సిద్ధమైన రాజయ్య ఎందుకో తటస్థంగాగనే ఉండిపోయారు.

కానీ కడియం పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరడం.. ఆ పార్టీ నుంచి ఎంపీగా ఆయన కుమార్తె బరిలో దిగడం చకచకా జరిగిపోయాయి. దీంతో కడియంకు చెక్ పెట్టాలని భావించిన కేసీఆర్.. రాజయ్యను తిరిగి పార్టీలోకి ఆహ్వానించారు. రాజయ్యను వరంగల్ ఎంపీగా కావ్యపై పోటీకి దింపాలని డిసైడ్ అయ్యారు. అయితే రాజయ్య పోటీకి నిరాకరించడంతో తాజాగా కొత్త అభ్యర్థిని బరిలో దింపారు. మరి కడియం లాంటి బలమైన నేతపై ఉద్యమకారుడైన సుధీర్ కుమార్ గెలుస్తారో లేదో తెలియాలంటే జూన్ 4వరకు వేచి చూడాలి.