KCR:సికింద్రాబాద్ కంటోన్మెంట్ అభ్యర్థిని ప్రకటించిన కేసీఆర్
Send us your feedback to audioarticles@vaarta.com
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నివేదిత పేరును పార్టీ అధినేత కేసీఆర్ ఖరారుచేశారు. పార్టీ ప్రముఖులు, స్థానిక నేతలతో చర్చించిన అనంతరం దివంగత ఎమ్మెల్యే సాయన్న కూతురు నివేదితను అభ్యర్థిగా ప్రకటించినట్లుగా బీఆర్ఎస్ పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. కాగా ఇటీవల రోడ్డు ప్రమాదంలో కంటోన్మెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యే లాస్య నందిత మరణించిన సంగతి తెలిసిందే. దీంతో ఆ స్థానంలో ఉప ఎన్నిక అనివార్యమైంది.
కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఉన్న సాయన్న 2023 ఫిబ్రవరిలో కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. అనంతరం గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సాయన్న కుమార్తె లాస్య నందితకు కేసీఆర్ టికెట్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో లాస్య విజయం సాధించారు. అయితే దురదృష్టశాత్తూ ఎన్నికల ఫలితాలు విడుదలైన మూడు నెలల వ్యవధిలోనే ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన కారు ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు. దీంతో సంవత్సరం వ్యవధిలోనే తండ్రి, కుమార్తె మరణించడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.
లాస్య మరణంతో ఉప ఎన్నిక అనివార్యం కావడంతో కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ బై ఎలక్షన్‌కు కూడా షెడ్యూల్ విడుదల చేసింది. మే 13న పోలింగ్ జరగనుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా బీజేపీలో నుంచి పార్టీలో చేరిన శ్రీ గణేష్‌కు టికెట్ కేటాయించింది. తాజాగా బీఆర్ఎస్ కూడా లాస్య నందిత సోదరి నివేదితను టికెట్ కేటాయించగా.. బీజేపీ మాత్రం తమ అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. మరి ఈ ఎన్నికల్లో సానుభూతి పరంగా బీఆర్ఎస్ పార్టీ తిరిగి గెలుస్తుందో.. లేక కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులకు ప్రజలు పట్టం కడతారో వేచి చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments