చేతులెత్తి దండం పెడుతున్నా సహకరించండి..: కేసీఆర్
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రభుత్వం ముందుగానే అప్రమత్తమైంది. విదేశాల నుంచి వచ్చే వారితోనే సమస్య. విదేశాల నుంచి రాష్ట్రానికి 20 వేల మందికి పైగా వచ్చారు. కరీంనగర్ ఘటన తర్వాత కలెక్టర్ల సమావేశం పెట్టాం. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి కరోనా లక్షణాలు ఉన్నాయా లేదా అనేది తెలియడం లేదు. 11 వేల మందిని గుర్తించి ఆధీనంలోకి తీసుకున్నాం. 5,274 నిఘా బృందాలను ఏర్పాటు చేశాం. విదేశాల నుంచి వచ్చిన వారిపై 14 రోజుల పర్యవేక్షణ. 700 మందికి పైగా కరోనా అనుమానితులకు పరీక్షలు చేశాం. ఇప్పటి వరకు రాష్ట్రంలో 21 మందికి కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందరూ బయటి దేశాల నుంచి వచ్చిన వారే. అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో 52 చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేశాం. 78 జాయింట్ టీమ్‌లను ఏర్పాటు చేశాం. అంతర్జాతీయ పరిణామాలను పర్యవేక్షించేందుకు ఐదుగురితో నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేశాం’ అని కేసీఆర్ మీడియాకు వెల్లడించారు.
చేతులెత్తి దండం పెడుతున్నా..!
‘విదేశాల నుంచి వచ్చిన వారిపై నియంత్రణ పెట్టాం. ఇప్పటి వరకు అంతా అదుపులోనే ఉంది. విదేశాల నుంచి వచ్చినవారికి చేతులెత్తి దండం పెడుతున్నా.. మీరు మా రాష్ట్రం బిడ్డలే.. బయట తిరిగి ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దు. క్వారంటైన్ నుంచి ఎందుకు పారిపోవాలి?. ప్రజలు ప్రభుత్వానికి సహకరించండి. విదేశాల నుంచి వచ్చినవారు స్వచ్ఛందంగా వైద్యులకు రిపోర్ట్ చేయండి. మీకు వ్యాధి లక్షణాలు ఉంటేనే ఆస్పత్రికి తరలిస్తారు. సామాజిక బాధ్యతతో వ్యవహరించాలి. జ్వరం, దగ్గు, జలుబు ఉంటే తక్షణమే రిపోర్ట్ చేయాలి. విదేశాల నుంచి వచ్చిన వారి సమాచారాన్ని సర్పంచ్‌లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు తెలియజేయాలి’ అని కేసీఆర్ సూచించారు.
ఆదివారం అన్నీ బంద్!
‘ఆదివారం ప్రతి ఒక్కరూ జనతా కర్ఫ్యూ పాటించాలి. తెలంగాణలో 24 గంటల పాటు జనతా కర్ఫ్యూ పాటిద్దాం. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి ఎల్లుండి 6 వరకు కర్ఫ్యూ పాటిద్దాం. జనతా కర్ఫ్యూలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలవాలి. తెలంగాణ వాళ్లను కరోనా ఏమీ చేయలేకపోయిందన్న పేరు తెచ్చుకోవాలి. ఆదివారం ఆర్టీసీ బస్సుల్ని వందశాతం నిలిపివేస్తాం. అత్యవసరాల కోసం ప్రతి డిపోలో 5 బస్సులు సిద్ధంగా ఉంచుతాం. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే బస్సుల్ని సరిహద్దులో నిలిపివేస్తాం. రేపు హైదరాబాద్‌లో మెట్రో రైల్‌ను నిలిపివేశాం. ఎమర్జెన్సీ కోసం 5 మెట్రో రైళ్లు సిద్ధంగా ఉంచుతాం. వ్యాపారులు స్వచ్ఛందంగా షాపులు మూసివేయాలి’ అని కేసీఆర్ పిలుపునిచ్చారు.
అందరూ సహకరిచండి!
‘చిరు వ్యాపారులు కూడా కర్ఫ్యూకి సహకరించాలి. అత్యవసర సర్వీసులకు మాత్రమే కర్ఫ్యూ నుంచి మినహాయింపు. మహారాష్ట్ర సరిహద్దుల్లో కరోనా విస్తరిస్తోంది. రెండు, మూడు రోజుల్లో మహారాష్ట్ర సరిహద్దులను మూసివేస్తాం. జబ్బును దిగుమతి చేసుకోవడం తెలివి తక్కువ పని. ఆస్పత్రులు, మెడికల్ షాపులు, పెట్రోల్ బంక్‌లు నడుపుకోవచ్చు. పాలు, కూరగాయలు కూడా అందుబాటులో ఉంటాయి. మనుషుల మధ్య 3 మీటర్ల దూరం పాటించండి. 60 ఏళ్ల పైబడిన వారు, పదేళ్లలోపు పిల్లలు 3 వారాల పాటు బయటికి రావొద్దు. 60 ఏళ్ల పైబడిన వారు ఎక్కువగా చనిపోతున్నారు. రోగుల సంఖ్య పెరిగితే సీసీఎంబీ సేవలు వినియోగించుకుంటాం’ అని కేసీఆర్ చెప్పుకొచ్చారు.
మనం పిలిస్తే తప్ప మనింటికి రాదు!
‘కరోనా నుంచి కాపాడేది స్వీయ నియంత్రణే. కరోనా స్వాభిమానం ఉన్న జబ్బు.. మనం పిలిస్తే తప్ప మన ఇంటికి రాదు. కరోనా ఉధృతి ఎక్కువైతే ఇంటింటికి రేషన్ పంపే యోచనలో ఉన్నాం. ఎన్ని వేల కోట్లైనా ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాం. ఢిల్లీ నుంచి టెస్టింగ్ పరికరాలు, మాస్క్‌లు వచ్చాయి. సమస్య తీవ్రమైతే మనం ముందుగా వైద్యుల్ని కాపాడుకోవాలి. మోదీ సందేశాన్ని కూడా సోషల్ మీడియాలో వక్రీకరిస్తున్నారు. కొందరు వక్రబుద్ధితో ప్రధానిని కూడా అవహేళన చేస్తున్నారు. ఇలాంటి వాళ్లను అరెస్ట్ చేయాలని డీజీపీకి చెప్పాను’ అని కేసీఆర్ తెలిపారు.
నేనూ వచ్చి చప్పట్లు కొడతా!
‘ఆదివారం సాయంత్రం 5 గంటలకు నేను కూడా కుటుంబ సభ్యులతో కలిసి బయటికి వచ్చి చప్పట్లు కొడతాను. చప్పట్లు కొట్టి మన ఐక్యతను చాటి చెప్పాలి. ఆదివారం సాయంత్రం 5 గంటలకు సైరన్ మోగిస్తాం. సైరన్ మోగగానే బయటికి వచ్చి 4 నిమిషాలు చప్పట్లు కొట్టాలి. కరీంనగర్లో 10 మంది ఇండోనేషియన్లకు లక్షణాలు ఉన్నాయి. ఉన్నతాధికారులు పక్క రాష్ట్రాలతో నిరంతరం టచ్‌లో ఉన్నారు. కరోనా లక్షణాలు ఉంటే 100శాతం ఖర్చు ప్రభుత్వమే భరిస్తుంది. పరిస్థితి చేయిదాటితే మొత్తం షట్‌డౌన్ చేస్తాం. నిత్యావసర సరుకుల్ని ప్రభుత్వమే ఇంటింటికి సరఫరా చేస్తుంది. ఇండోనేషియన్లు తప్పు చేయలేదు, కేంద్రం అనుమతి ఇస్తేనే వచ్చారు. ఆలయాల్లో నిత్యపూజలు కొనసాగుతున్నాయి’ అని కేసీఆర్ స్పష్టం చేశారు.
ఇప్పటి వరకూ 21 పాజిటివ్ కేసులు..
‘కరీంనగర్లో 50 వేల మందికి పరీక్షలు చేశాం. ప్రజలకు అసౌకర్యం కలగొద్దని కరీంనగర్ పర్యటన వాయిదా వేసుకున్నాను. కరీంనగర్లో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. ఇండోనేషియన్లు ఎక్కడెక్కడ తిరిగారో విచారణ చేస్తున్నాం. ఎయిర్‌పోర్టులు, పోర్టులు మూసివేయాలని ప్రధానికి చెప్పాను. ఒకేసారి మూసివేయడం కూడా సాధ్యం కాదు. తెలంగాణ పేద రాష్ట్రం కాదు.. అవసరమైతే పేదలకు సరుకులు ఉచితంగా అందిస్తాం. నేను బతికున్నంత వరకు పేదలకు కష్టం రానివ్వను. నిత్యావసరాల కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. రాష్ట్రంలో ఒక్క కరోనా పేషెంట్‌కు కూడా వెంటిలేటర్ పెట్టే పరిస్థితి రాలేదు. తెలంగాణలో ఇప్పటి వరకు 21 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అనుమానితులను 14 రోజులపాటు క్వారంటైన్లో ఉంచుతాం. విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు ప్రభుత్వానికి సహకరించి, సెల్ఫ్ రిపోర్టు చేయాలి. ప్రభుత్వమే చికిత్సతో పాటు అన్ని ఖర్చులు భరిస్తుంది’ అని తెలంగాణ ప్రజలకు మీడియా ముఖంగా కేసీఆర్ పిలుపునిచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments