Kavitha:కవితకు షాక్.. మరో మూడు రోజులు కస్టడీ పొడిగింపు

  • IndiaGlitz, [Saturday,March 23 2024]

లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ రౌజ్ అవెన్యూ సీబీఐ కోర్టులో మరోసారి చుక్కెదురైంది. ఆమె ఈడీ కస్టడీని మరో మూడు రోజులు పొడిగించింది. ఈనెల 15న అరెస్టైన కవితకు వారం రోజుల పాటు కస్టడీ విధించిన సంగతి తెలిసిందే. నేటితో కస్టడీ గడువు ముగియడంతో ఆమెను ఈడీ అధికారులు కోర్టులో హాజరుపరిచారు. మిగతా నిందితులతో కలిపి కవిత నుంచి మరింత సమాచారం రాబట్టాల్సి ఉందని.. మరో ఐదు రోజులు కస్టడీని పొడిగించాలని ఈడీ తరపు న్యాయవాది వాదించారు.

సౌత్‌గ్రూప్‌నకు రూ.100కోట్లు చేరాయ‌ని ఆరోపించారు. క‌విత ఫోన్ డేటాను తొలిగించిన‌ట్లు త‌మ ద‌ర్యాప్తులో తేలింద‌ని ఈడీ కోర్టుకు తెలియ‌జేసింది. అలాగే ఆమె కుటుంబ స‌భ్యుల వివ‌రాల‌ను ఇవ్వడం లేద‌న్నారు. ప్రస్తుతం క‌విత బంధువుల ఇంట్లో సోదాలు జ‌రుగుతున్నాయ‌ని పేర్కొంది. వాదనలు ముగిసిన అనంతరం మరో మూడు రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఈనెల 26 వరకు ఆమె ఈడీ కస్టడీలోనే ఉన్నారు. కోర్టుకు హాజరయ్యే ముందు కవిత మీడియాతో మాట్లాడారు. తనను అక్రమంగా అరెస్ట్ చేశారని.. దీనిపై న్యాయపోరాటం చేస్తానని తెలిపారు. అలాగే విచారణలో భాగంగా సంవత్సరం కింద అడిగిన ప్రశ్నలనే మళ్లీ అడిగారని పేర్కొన్నారు.

అంతకుముందు ఇవాళ తెల్లవారుజామున నుంచే హైదరాబాద్‌లోని కవిత బంధువుల ఇళ్లతో పాటు ఆమె భర్త అనిల్ కుమార్ బంధువుల ఇళ్లలోనూ ఈడీ అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు. మాదాపూర్‌లో ఉన్న కవిత ఆడపడుచు అఖిల ఇంట్లోనూ తనిఖీలు చేస్తున్నారు. తనిఖీల్లో ఏం దొరికాయి..? ఏమైనా కొత్త అరెస్టులు ఉంటాయా..? అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఇదే కేసులో ఆమె భర్త అనిల్‌ను విచారణకు రావాలని కూడా నోటీసులిచ్చారు. అయితే ఆయన విచారణకు హారుకాలేదు.

మరోవైపు ఇదే కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను ఆరు రోజుల పాటు కస్టడీకి ఇచ్చిన విషయం విధితమే. ఇప్పుడు కవిత కస్టడీ కూడా పొడిగించిన నేపథ్యంలో ఇద్దరిని కలిపి విచారించే అవకాశముంది. లిక్కర్ పాలసీ రూపకల్పన, సౌత్ గ్రూప్ పాత్ర, రూ.100 కోట్ల ముడుపులు, విజయ్ నాయర్ సహా నిందితులతో ఉన్న సంబంధాలు.. అప్రూవర్లు, ఇతర నిందితులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా ఇద్దరిని ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారని సమాచారం.