Kavitha:సుప్రీంకోర్టులో కవిత పిటిషన్.. అక్రమంగా అరెస్ట్ చేశారని ఫిర్యాదు..
Send us your feedback to audioarticles@vaarta.com
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తనను ఈడీ అక్రమంగా అరెస్ట్ చేసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. తాను వేసిన పిటిషన్ న్యాయస్థానంలో విచారణ జరుగుతుండగానే అక్రమంగా అరెస్ట్ చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. విచారణ సందర్భంగా నోటీసులు ఇవ్వమని.. చర్యలు తీసుకోమని చెప్పి అక్రమంగా అరెస్ట్ చేశారని తెలిపారు. కోర్టు ధిక్కరణకు పాల్పడిన ఈడీ అధికారులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈమేరకు ఆమె తరపు న్యాయవాది ఆన్‌లైన్‌లో పిటిషన్ నమోదుచేశారు. ఈ పిటిషన్‌ను మంగళవారం సుప్రీంకోర్టు విచారించనుంది.
అటు రెండో రోజు విచారణలో భాగంగా కవితతో పాటు ఆమె భర్త అనిల్, వ్యక్తిగత సిబ్బందిని సైతం ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. మరోవైపు తొలి రోజు విచారణలో కవితపై ఈడీ ప్రశ్నల వర్షం కురిపించింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పలు అంశాలపై ప్రశ్నించారు. కోర్టు ఆదేశాల మేరకు విచారణ మొత్తాన్ని వీడియో తీశారు. విచారణ అనంతరం నిబంధనల మేరకు కవిత భర్త అనిల్, సోదరుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, న్యాయవాది మోహిత్ రావులు ఆమెను కలిశారు.
లిక్కర్ స్కాం కేసులో గత శుక్రవారం మధ్యాహ్నం నుంచి కవిత ఇంట్లో ఈడీ, ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. నాలుగు గంటల సోదాల అనంతరం ఆమె ఫోన్లు సీజ్ చేసి అరెస్ట్ చేస్తున్నట్లు తెలిపారు. అయితే తనను ఏ ప్రాతిపదికన అరెస్టు చేస్తున్నారంటూ అధికారులను ప్రశ్నించారు. అనంతరం విమానంలో ఢిల్లీకి తీసుకెళ్లారు. శనివారం ఉదయం రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చగా ఆమెకు న్యాయమూర్తి వారం రోజుల కస్టడీ విధించారు. ఈనెల 23 వరకూ ఈడీ విచారణకు అనుమతించింది. అదే రోజు మధ్యాహ్నం మరోసారి కవితను కోర్టులో హాజరుపరచాలని న్యాయమూర్తి ఈడీ అధికారులను ఆదేశించారు.
కాగా గతేడాది మార్చిలో కవితను మూడు సార్లు ఢిల్లీలో ఈడీ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. విచారణకు సహకరించిన కవిత.. అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఆ సమయంలో ఆమె వినియోగించిన ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు సైతం వారికి అప్పగించారు. అప్పుడు రోజుకు దాదాపు 10 గంటలకు పైగా కవితను విచారించారు. అంతసేపు విచారించడంతో ఆమె అరెస్ట్ ఖాయమని జోరుగా ప్రచారం జరిగింది. అయితే అప్పటినుంచి కవిత విచారణ పెండింగ్‌లోనే ఉంది. సరిగ్గా ఏడాది తర్వాత ఆమెను అరెస్ట్ చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout