Kavitha:లిక్కర్ స్కాంలో కవితదే కీలక పాత్ర.. ఈడీ సంచలన ప్రకటన..
Send us your feedback to audioarticles@vaarta.com
ఢిల్లీ లిక్కర్ కేసులో(Delhi Liquor Scam Case) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) కీలక ప్రకటన విడుదల చేసింది. ఆప్ లీడర్లతో కలిసి కవిత అక్రమాలకు పాల్పడినట్లు తేలిందని ప్రకటించింది. రూ.100 కోట్ల మొత్తాన్ని ఆప్ నాయకులకు చేర్చడంలో ఆమె కీలక పాత్ర పోషించారని స్పష్టంచేసింది. ఈ కేసులో దేశవ్యాప్తంగా 245 ప్రాంతాల్లో సోదాలు చేశామని.. ఢిల్లీ, హైదరాబాద్ ,చెన్నై, ముంబైతో పాటు పలు ప్రాంతాలో తనిఖీలు నిర్వహించామని వెల్లడించింది.
లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటివరకు 15 మందిని అరెస్ట్ చేశామని.. మొత్తం రూ.128.79 కోట్లు సీజ్ చేశామని పేర్కొంది. మనీశ్ సిసోడియా, సంజయ్ సింగ్, విజయ్ నాయర్‌తో పాటు పలువురిని అరెస్ట్ చేసినట్లు చెప్పుకొచ్చింది. అలాగే ఈ కేసులో అరెస్ట్ చేసిన కవితను ఏడు రోజుల కస్టడీకి ఢిల్లీ ప్రత్యేక కోర్టు అనుమతించిందని.. ఈ నెల 23 వరకు రిమాండ్ విధించిందని తెలిపింది. హైదరాబాద్‌లోని కవిత ఇంట్లో ఈ నెల 15న సోదాలు నిర్వహించిన సమయంలో ఆమె బంధువులు ఆటంకం కలిగించారని ఆ ప్రకటనలో వివరించింది.
కాగా ఈడీ కార్యాలయంలో రెండో రోజు విచారణ పూర్తి కావడంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు కవితతో ములాఖత్ అయ్యారు. ఆమె భర్త అనిల్ మాత్రం రాలేదు. ఈ కేసులో ఆయనకు కూడా ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. అయితే తాను 10 రోజుల పాటు విచారణకు హాజరుకాలేనని సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి ఆయన వివరణపై అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.
మరోవైపు తనను ఈడీ అక్రమంగా అరెస్ట్ చేసిందని కవిత సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ సందర్భంగా నోటీసులు ఇవ్వమని.. చర్యలు తీసుకోమని చెప్పి అక్రమంగా అరెస్ట్ చేశారని తెలిపారు. కోర్టు ధిక్కరణకు పాల్పడిన ఈడీ అధికారులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈమేరకు ఆమె తరపు న్యాయవాది ఆన్లైన్లో పిటిషన్ నమోదుచేశారు. ఈ పిటిషన్‌ను మంగళవారం న్యాయస్థానం విచారించనుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments