Kavitha:సుప్రీంకోర్టులో కవితకు చుక్కెదురు.. బెయిల్ ఇవ్వడం కుదరదన్న ధర్మాసనం..

  • IndiaGlitz, [Friday,March 22 2024]

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులోనూ ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. లిక్కర్ స్కాం కేసులో ఈడీ అధికారులు తనను అక్రమంగా అరెస్ట్ చేశారని.. వెంటనే బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ప్రస్తుతం బెయిల్ ఇవ్వలేమని.. ఇందుకోసం ట్రయల్ కోర్టుకు వెళ్లాలని సూచించింది. అలాగే కవిత బెయిల్ పిటిషన్‌పై జాప్యం లేకుండా విచారణ జరపాలని ట్రయల్ కోర్టును ఆదేశించింది.

మరోవైపు పిటిషన్‌లో కవిత లేవనెత్తిన ఇతర అంశాలపై విచారణకు ధర్మాసనం అంగీకరించింది. ఈ మేరకు ఈడీకి నోటీసులు జారీ చేసింది. ఆరు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. రాజ్యాంగ ఉల్లంఘనలకు సంబంధించి పిటిషన్‌లో లేవనెత్తిన అంశాలను ఇప్పటికే దాఖలైన విజయ్ మదన్ లాల్ కేసుకు జత చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. విచారణలో భాగంగా బెయిల్ తాము ఇవ్వలేమని.. ఎవరైనా సరే కింది కోర్టును మొదట ఆశ్రయించాల్సిందేనని స్పష్టం చేసింది.

కాగా లిక్కర్ స్కాం కేసులో నిందితురాలిగా ఉన్న కవితను మనీ లాండరింగ్ ఆరోపణలపై ఈ నెల 15న అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం రౌస్ అవెన్యూ కోర్టు 7 రోజుల పాటు కస్టడీకి అనుమతించింది. దీంతో ఐదు రోజుల పాటు కవితను అధికారులు విచారించారు. ఈ క్రమంలోనే ఈడీ అరెస్ట్‌ను సవాల్ చేస్తూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ట్రయిల్ కోర్టును ఆశ్రయించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో అక్కడ ఏం జరగనుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

ఇదిలా ఉంటే ఈ కేసులోనే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను గురువారం రాత్రి ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం విధితమే. దీంతో ఢిల్లీలో హైటెన్షన్ వాతావరణం నెలకొడంతో భారీగా భద్రతా బలగాలు మోహరించాయి. మొత్తానికి ఎన్నికల వేళ దేశవ్యాప్తంగా లిక్కర్ కేసు భారీ ప్రకంపనలు సృష్టిస్తోంది.