టీడీపీలోకి కౌశల్.. ఎంపీగా పోటీ..!
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ నటుడు, బిగ్‌బాస్ విజేత కౌశల్ సైకిలెక్కేశారా..? ఇక అధికారికంగా పసుపు కండువా కప్పుకోవడమే ఆలస్యమా..? 2019 ఎన్నికల్లో ఆయన ఎంపీగా బరిలోకి దిగనున్నారా..? యంగ్ ఎంపీ రామ్మోహన్ నాయుడు, మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నీ మేం చూస్కుంటాం.. రాజకీయ అరంగేట్రం చేయమని గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారా..? అందుకే అన్నీ ఆలోచించాక సీఎం చంద్రబాబును కౌశల్ కలిశారా..? అంటే తాజా పరిణామాలను బట్టి చూస్తే అక్షరాలా నిజమనిపిస్తోంది.
అవకాశం వచ్చింది.. వదులుకుంటే ఎలా..!?
టాలీవుడ్ నటుడిగా కౌశల్‌గా ఈయనకు పెద్ద పేరు లేకపోయినప్పటికీ.. బిగ్‌బాస్ విజేతగా నిలిచిన తర్వాత కౌశల్ పేరు మార్మోగింది. లక్షలాది మంది అభిమానులు.. కౌశల్ ఆర్మీ, కౌశల్ ఫౌండేషన్ ఇలా కొత్త కొత్తవన్నీ పుట్టుకొచ్చాయి. అయితే ఈ క్రేజ్‌ను చూసిన పలు రాజకీయ పార్టీలు కౌశల్‌ను పార్టీలో చేర్చుకుంటే మంచి జరుగుతుందని భావించారు. అంతేకాదు ఒకానొక సందర్భంలో టీడీపీ ఎంపీగా కౌశల్‌ను బరిలోకి దింపాలని ఆ పార్టీ అధినేత భావించారు కూడా. అయితే దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలనుకున్న కౌశల్ అవకాశం వెతుక్కుంటూ వచ్చి తలుపుతడితే మిన్నకుండిపోవడం మంచిది కాదని సైకిల్‌పై సవారీ చేసేందుకు ఆయన సిద్ధమైపోయారు.
చంద్రబాబుతో భేటీ..
శుక్రవారం రాత్రి సీఎం చంద్రబాబును కౌశల్ కలిశారు. ఉండవల్లిలోని ప్రజావేదికలో సీఎం ఉండగా.. మంత్రి గంటా శ్రీనివాసరావ్.. కౌశల్‌ను తనవెంట తీసుకెళ్లి భేటీ జరిపించారు. సుమారు అరగంటకు పైగా తాజా రాజకీయ పరిణామాలు.. పోటీ విషయంపై నిశితంగా చర్చించినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. టీడీపీతో కలిసి పని చేయడానికి బిగ్‌బాస్ సుముఖుత వ్యక్తం చేశారు. టీడీపీకి మద్దతు ఇచ్చి.. అవసరమైతే ప్రచారం కూడా చేస్తానని కౌశల్ చెప్పడంతో ఆయన్ను చంద్రబాబు మెచ్చుకున్నారు. మరో రెండు మూడ్రోజుల్లో మంచి ముహూర్తం చేసుకుని తన కుటుంబీకులు, అభిమాన సంఘం నేతలతో కలిసి అమరావతికి వెళ్లి చంద్రబాబు సమక్షంలో కౌశల్ పసుపు కండువా కప్పుకోబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
పవన్ ఫ్యాన్స్ షాక్..!?
తాను పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్ అని.. ‘తమ్ముడు’ నుంచి ఆయనంటే నాకు చాలా గౌరవమని.. తాను బిగ్‌బాస్ విజేతగా గెలవడానికి మెగా, మహేశ్ అభిమానులే కారణమని కౌశల్ పలు సందర్భాల్లో చెప్పిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. అంతేకాదు ఆయన అభిమానులంతా కచ్చితంగా జనసేనలో చేరతారని భావించారు. అయితే ఉన్నట్టుండి చంద్రబాబుతో భేటీ కావడంతో పవన్ అభిమానులే కాదు.. ఇటు సొంత అభిమానులు, కౌశల్ ఆర్మీ కూడా షాక్‌కు గురైంది.
ఎంపీగా పోటీ చేస్తారా..?
యంగ్ ఎంపీ రామ్మోహన్ నాయుడు, మంత్రి గంటా శ్రీనివాసరావు అన్ని విధాలా సపోర్ట్ చేస్తామని భరోసా ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. పైగా సామాజికవర్గం పరంగా చూస్తే కౌశల్ కాపు కావడంతో రాజకీయ అరంగేట్రం చేయించి.. ఎంపీగా రంగంలోకి దింపాలని ఇదివరకే చంద్రబాబు ఓ మీటింగ్‌లో పార్టీ నేతలతో చర్చించినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అవన్నీ అప్పట్లో పుకార్లు అని భావించినప్పటికీ తాజా భేటీతో ఫుల్ క్లారిటీ వచ్చేసింది. అయితే అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ టీడీపీకి గుడ్‌బై చెప్పడంతో ఆ స్థానం నుంచి కౌశల్‌ను పోటీ చేయించాలనే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలిసింది. కౌశల్‌కు టీడీపీలో ఎంపీ టికెట్ వస్తుందా..? లేకుంటే ఎమ్మెల్యే టికెట్ వస్తుందా..? టికెట్ ఇస్తే ఏ మాత్రం సక్సెస్ అవుతారు అనే విషయం తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments