శ్రీరాముడిపై ‘కత్తి’ అనుచిత వ్యాఖ్యలు.. మళ్లీ బహిష్కరణ తప్పదా!!
- IndiaGlitz, [Sunday,February 09 2020]
సినీ క్రిటిక్ కత్తి మహేశ్ గురించి ప్రత్యేకించి చెప్పడానికేమీ లేదు. రోజుకు మూడు వివాదాలు.. ఆరు తిట్లు ఇదే జీవితంగా బతికేస్తుంటాడు.! అంతేకాదు సామాన్యుడి నుంచి సెలబ్రిటీ వరకు ఎవర్నీ వదలకుండా తనదైన శైలిలో విమర్శలు గుప్పించడంతో ఆయన నిత్యం వార్తల్లో నానుతుంటారు. అయితే ఎప్పుడూ మనుషులనేనా..? దేవుడిపై కూడా సెటైర్లు వేయాలనుకున్నాడో.. లేకుంటే హాట్ టాఫిక్ అవ్వాలంటే ఏదో ఒకటి చేయాలని అనుకున్నాడో కానీ.. తాజాగా ఏకంగా.. శ్రీరాముడిపైనే అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన కొందరు వ్యక్తులు కత్తిపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ఐపీసీ 502 సెక్షన్ కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే పలు వివాదాలతో ఆయనపై కేసులు నమోదవ్వగా తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నాడు.
అసలేం జరిగింది!
ఇటీవల ఓ కార్యక్రమంలో కత్తి మాట్లాడుతూ.. ‘శ్రీరాముని ఫేవరెట్ వంటకం జింక మాంసం. సీతా దేవి జింకను తీసుకుని రమ్మని కోరింది.. వండుకుని తినడానికే. రాముడి అంతఃపురంలో చాలామంది వేశ్యలు ఉండేవారు’ అని వ్యాఖ్యానించాడు. అయితే అదే కార్యక్రమంలో.. సోషల్ మీడియాలో ఆయన వ్యాఖ్యలను పలువురు నెటిజన్లు, హిందువులు ఖండించినప్పటికీ.. తన వ్యాఖ్యలను సమర్థించుకునే ప్రయత్నం చేయడం గమనార్హం. అంతటితో ఆగని ఆయన.. ‘నేను భయంకరమైన హిందువును. దేన్నీ గుడ్డిగా ఫాలో కాబోను. మీకు సందేహాలుంటే వాల్మీకి రామాయణ అనువాదంలోని ఉత్తర కాండలో ఉన్న 42 సర్గ, 18 నుంచి 22 వరకూ వచనాలు, యుద్ధకాండంలోని వచనాలు చూడాలి’ అని విమర్శకులకు బదులిచ్చాడు.
మరోసారి బహిష్కరణ తప్పదా..!?
ఇదిలా ఉంటే.. 2018లోనూ రాముడిపై కత్తి మహేశ్ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీని ఫలితం.. ఆరు నెలల పాటు హైదరాబాద్ నుంచి బహిష్కరణకు గురయ్యాడు. ఈ వివాదంపై కలుగజేసుకున్న అప్పటికి తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేసి బహిష్కరణ చేసిన విషయం విదితమే. అయితే తాజాగా మరోసారి రాముడిపై ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో హిందూ సంఘాలు మరోసారి దీనిపై ఉద్యమించి ఆయన్ను బహిష్కరించే దిశగా అడుగులు వేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా అస్తమాను కెలికి మరీ చేయడంలో ఆనందం ఉంటుందని కత్తి అనుకుంటున్నాడో.. లేకుండే తినింది అరగక ఇలా చేస్తున్నాడో అంటూ విమర్శకులు తిట్టి పోస్తున్నారు. మరి కత్తిలో ఎప్పుడు మార్పు వస్తుందో ఏంటో ఆయనకే తెలియాలి..!