కత్తి మహేష్ పరిస్థితి విషమం.. వెంటిలేటర్ పై చికిత్స

  • IndiaGlitz, [Saturday,June 26 2021]

సినీ విమర్శకులు, నటుడు కత్తి మహేష్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం శనివారం ఉదయం కత్తి మహేష్ ప్రయాణిస్తున్న ఇనోవా కారు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖర పురం వద్ద జాతీయ రహదారిపై ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. కారు లారీని బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.

ఈ ప్రమాదంలో కత్తి మహేష్ తలకు, కంటికి తీవ్రమైన గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే నెల్లూరు మెడికేర్ ఆసుపత్రికి కత్తి మహేష్ ని తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం కత్తి మహేష్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం వైద్యులు కత్తి మహేష్ ని ఐసోలేషన్ లో వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. మరికొన్ని గంటల తర్వాత కత్తి మహేష్ ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల చేస్తామని ఆసుపత్రి యాజమాన్యం చెబుతోంది.

ప్రమాద సమయంలో కారు డ్రైవర్ సహాయంతో పోలీసులు, హైవే పెట్రోలింగ్ సిబ్బంది కారులో ఉన్నది కత్తి మహేష్ అని గుర్తించారు. ప్రస్తుతం ఆసుపత్రి వద్ద కత్తి మహేష్ కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఉన్నారు.

ఫిలిం క్రిటిక్ గా గుర్తింపు పొందిన కత్తి మహేష్ ఇప్పుడిప్పుడే నటుడిగా కూడా రాణిస్తున్నారు.