జబర్‌దస్త్‌తో పేరు సంపాదించుకున్న అనసూయ భరద్వాజ్ `క్షణం`, `రంగస్థలం` వంటి చిత్రాలతో వెండితెరపై కూడా నటిగా మంచి పేరుని సంపాదించుకుంది. ఈమెను ప్రధాన పాత్రధారిగా చేసి రాజేష్ నాదెండ్ల దర్శకత్వంలో బి.నరేంద్ర రెడ్డి, శర్మ చుక్కా నిర్మించిన చిత్రం `కథనం`. కొత్త కాన్సెప్ట్ చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న నేటి తరుణంలో అనసూయ మెయిన్ లీడ్‌గా `కథనం`తో విజయాన్ని సాధించిందా? లేదా? అని తెలుసుకోవాలంటే కథేంటో చూద్దాం...
కథ:
అను(అనసూయ) అసిస్టెంట్ డైరెక్టర్ నుండి డైరెక్టర్ కావాలనుకుంటుంది. అందు కోసం కథలను సిద్ధం చేసుకుని నిర్మాతలను కలిసి దర్శకురాలిగా అవకాశం అడుగుతుంటుంది. కానీ ఆమె ప్రయత్నాలు ఫలించవు. అలాంటి సందర్భంలో ఓ నలుగురు నిర్మాతలు అను చెప్పిన మర్డర్ మిస్టరీ నచ్చి సినిమాను నిర్మించడానికి ముందుకు వస్తారు. అయితే నగరంలో జరిగే కొందరి వీఐపీ చావులు అను రాసుకున్న స్క్రిప్ట్ ప్రకారమే జరుగుతుంటాయి. దాంతో భయపడ్డ అను.. పోలీస్ ఆఫీసర్(రణధీర్)ని కలిసి జరగుతున్న విషయాలను చెబుతుంది. పోలీస్ ఆఫీసర్ ముందు అను చెప్పే విషయాన్ని నమ్మకపోయినా.. తర్వాత అర్థం చేసుకుని ఆమెకు సాయం చేయాలనుకుంటాడు. అప్పుడేమవుతుంది? అసలు అను స్క్రిప్ట్ ప్రకారమే హత్యలు చేస్తున్నదెవరు? చనిపోతున్న వీఐపీలెవరు? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..
విశ్లేషణ:
అనసూయ వెండితెరపై నటిగా మరింతగా రాణించాలనుకుని కథనం సినిమాను ఒప్పుకున్నట్లు అర్థమవుతుంది. అసిస్టెంట్ డైరెక్టర్ అను, గ్రామ ప్రజలకు సాయపడే అరవిందమ్మ అనే రెండు షేడ్స్‌లో చక్కగా నటించింది. అయితే ఈ పాత్రను అనసూయ ఎందుక ఒప్పుకుందనేది అర్థం కాలేదు. ఎందుకంటే టైటిల్ కథనం అయినా కూడా.. సినిమాలో కథనమే ఉండదు.. అడుగుకి ఒక తప్పు కనపడుతుంది. అసలు, హంతుకు వీఐపీలను చంపే విధానంపై ఈ సినిమాలో క్లారిటీ కనపడదు. ఏదో సీన్స్ చూపించేయడం.. మాటల్లో చెప్పేస్తే ప్రేక్షకుడు కన్విన్స్ అవుతాడా? అంటే కచ్చితంగా కాడు. సినిమాలో ఎక్కడా లాజిక్స్ కనపడవు. సినిమా ప్రారంభం నుండి చివరి వరకు కథంతా చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. సినిమాను ఓ క్రమంలో తెరకెక్కించలేదు. ఏదో తీసేయాలని చేసినట్లుగా ఉంది. పాత్రల చిత్రీకరణలో క్లారిటీ ఉండదు. సన్నివేశాల మధ్య పొంతన ఉండదు. ధన్‌రాజ్, వెన్నెలకిషోర్ మధ్య కామెడీ మరి వీక్ ట్రాక్‌గా కనిపిస్తుంది. రాజేష్ సాలూరి సంగీతం బాలేదు. సతీష్ ముత్యాల కెమెరా వర్క్‌లో విజువల్స్ బాలేవు. మొత్తంగా దర్శకుడు రాజేష్ నాదెండ్ల చేసిన పనేంటి? మాటలతో నిర్మాతలను అనసూయను మోసం చేశాడా? అనేలా ఈ సినిమా సాగింది.
బోటమ్ లైన్: కథనం.. నిరాశ పరిచింది
Comments