దిగ్గజ కథక్ డ్యాన్సర్ పండిట్ బిర్జూ మహారాజ్ కన్నుమూత
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రపంచ ప్రఖ్యాత కథక్ నృత్యకారుడు, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత పండిట్ బిర్జు మహారాజ్ కన్నుమూశారు. ఆయన వయసు 83 సంవత్సరాలు. సోమవారం ఉదయం గుండెపోటుతో ఆయన మరణించినట్లు కుటుంబసభ్యులు పేర్కొన్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ఆయన కథక్ డ్యాన్సర్‌గానే కాకుండా, శాస్త్రీయ గాయకుడు, కవి, డ్రమ్మర్‌గాను రాణించారు. బాలీవుడ్ క్లాసిక్స్ అయిన దేవదాస్, దేద్ ఇష్కియా, ఉమ్రావ్ జాన్, బాజీ రావ్ మస్తానీ వంటి అనేక సినిమాలకు బిర్జూ మహారాజ్ నృత్య దర్శకత్వం వహించారు. దిగ్గజ దర్శకుడు సత్యజిత్ రే తెరకెక్కించిన ‘చెస్ కే ఖిలాడీ’కి స్వరాలు సమకూర్చారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నో ఘరానాకు చెందిన బిర్జూ మహారాజ్ 1938 ఫిబ్రవరి 4న జన్మించారు. ఆయన అసలు పేరు పండిట్ బ్రిజ్మోహన్ మిశ్రా. తండ్రి చనిపోవడంతో 9 ఏళ్ల చిరుప్రాయంలోనే ఆయన కుటుంబ బాధ్యతలను భుజాలపై వేసుకున్నారు. తన మామయ్య దగ్గర కథక్‌లో శిక్షణ తీసుకొని కెరీర్ ప్రారంభించారు. తొలిసారి ఆయన సోలోగా బెంగాల్‌లోని మన్మథ్ నాథ్ ఘోష్ ఉత్సవాల్లో ప్రదర్శన ఇచ్చారు. ఇక అప్పటి నుండి వెనక్కి తిరిగి చూడకుండా దూసుకెళ్లారు.
కథక్ నృత్యానికి అందించిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్‌తో సత్కరించింది. దీనితో పాటు సంగీత నాటక అకాడమీ అవార్డు, కాళిదాస్ సమ్మాన్, నృత్య చూడామణి, ఆంధ్రరత్న, నృత్య విలాస్, ఆదర్శ శిఖర్ సమ్మాన్, సోవియట్ ల్యాండ్ నెహ్రూ అవార్డు, శిరోమణి సమ్మాన్, రాజీవ్ గాంధీ శాంతి పురస్కారం ఇలా ఎన్నో అవార్డ్స్ బిర్జూ మహారాజ్‌ను వరించాయి. ‘విశ్వరూపం' చిత్రంలో ఆయన నృత్యానికి 2012లో జాతీయ చలనచిత్ర పురస్కారం లభించింది. అలాగే 2016 సంవత్సరంలో బాజీరావ్ మస్తానీ రాసిన 'మోహే రంగ్ దో లాల్' పాటకు అందించిన కొరియోగ్రఫీకి ఫిలింఫేర్ అవార్డు వరించింది. ఆయన మరణం పట్ల పలువురు సినీ, రాజకీయ రంగాల ప్రముఖులు సంతాపం తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout