Katamarayudu Review
రాజకీయాల్లో బిజీ కావాలనుకుంటున్న పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ తన అభిమానులను దృష్టిలో పెట్టుకుని స్క్రిప్ట్స్ సెలక్ట్ చేసుకోవడం మొదలు పెట్టాడు. అందులో భాగమే కాటమరాయుడు సినిమా చేయడం. పక్కా మాస్ ఎలిమెంట్స్‌తో తమిళంలో విజయం సాధించిన ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలంటే గుర్తు పెట్టుకోవాల్సిన విషయాలు పవన్‌కళ్యాణ్ ఇమేజ్, తెలుగు నెటివిటీ మిస్ కాకుండా చూసుకోవడం. పవన్‌తో గోపాల గోపాల సినిమా చేసిన దర్శకుడు డాలీ అల్రెడి రీమేక్ సినిమాలను హ్యండిల్ చేయడంలోని అనుభవంతో పవన్ అతనికి దర్శకత్వ బాధ్యతలను అప్పగించాడు. మరి డాలీ పవన్‌ను ఎలా ప్రెజెంట్ చేశాడు. కాటమరాయుడు ఎలా అలరించాడో తెలుసుకోవాలంటే ముందు కథలోకి వెళదాం...
కథ:
రాయలసీమ ప్రాంతానికి చెందిన కాటమరాయుడు(పవన్ కళ్యాణ్)..ఊళ్ళో పెద్ద మనిషి. అతనికి నలుగురు తమ్ముళ్ళు( అజయ్, కమల్ కామరాజు, శివబాలాజీ, చైతన్యకృష్ణ), లింగబాబు(అలీ) కూడా కాటమరాయుడతో మంచి స్నేహాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. కాటమరాయుడుకి ఉన్న మంచి పేరుతో పాటు శత్రువులు కూడా ఉంటారు.
కాటమరాయుడుకి ఆడవాళ్ళంటే గిట్టకపోవడంతో తమ్ముళ్లు, లింగబాబు వారి ప్రేమ వ్యవహారాలను అతనికి చెప్పడానికి భయపడుతుంటారు. ఎలాగైనా కాటమరాయుడుని కూడా ప్రేమలో పడేటట్లు చేస్తే, తమ ప్రేమను కూడా అన్నయ్య అంగీకరిస్తాడని అందరూ ప్లాన్ చేసి అవంతిక(శృతిహాసన్)తో కాటమరాయుడు ప్రేమలో పడేలా చేస్తారు. అవంతిక, రిటైర్డ్ జడ్జ్ భూపతి(నాజర్)కూతురు. భూపతికి గొడవలంటే పడవు. తమ ప్రేమ వ్యవహారాన్ని చెప్పడానికి కాటమరాయుడుతో కలిసి అవంతిక రైలులో ఊరుకి బయలుదేరుతుంది. రైలులో వీరిపై కొందరు దుండగులు ఎటాక్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఇంతకు వాళ్ళెవరు? ఎలసరి భాను, భూపతికి ఉన్న గొడవేంటి? కాటమరాయుడు తన ప్రేమ కోసం ఏం చేశాడనే సంగతి తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే...
ప్లస్ పాయింట్స్ః
- పవన్‌కళ్యాణ్
- లవ్ ట్రాక్
- కామెడి
- సినిమాటోగ్రఫీ
బలహీనతలు:
- పాటలు
- సెకండాఫ్ కాస్తా లెంగ్తీగా అనిపించడం
విశ్లేషణ:
కాటమరాయుడు పాత్రలో పవన్ కళ్యాణ్ విజృభించాడు. హోల్ అండ్ సోల్‌గా సినిమాను ముందుకు నడిపించాడు. కథ అంతా తన చుట్టూనే తిరుగడం, డైరెక్టర్ పాత్రను డిజైన్ చేసిన తీరు, పవన్ ఆ పాత్రను క్యారీ చేసిన విధానం ప్రేక్షకులను, అభిమానులను మెప్పిస్తుంది. ఫస్టాఫ్ మొత్తం పవన్ పంచెకట్టులోనే కనిపిస్తాడు. సెకండాఫ్‌లో లుక్ కాస్తా మారుతుంది. పంచెకట్టులోపవన్ లుక్ బావుంది. ఇక స్టయిలిష్ ఫైట్స్ కూడా బావున్నాయి. పవన్ ఇంట్రడక్షన్, మిరా మిరా మీసం సాంగ్ అభిమానులకు ముందు నుండే ఓ ఊపు తెచ్చి పెడుతుంది. ఇక శృతిహాసన్ పాత్ర పరంగా ఒదిగిపోయి తన పాత్రకు న్యాయం చేసింది. పవన్ తమ్ముళ్ళుగా నటించిన అజయ్, కమల్ కామరాజు, శివబాలాజీ, చైతన్యకృష్ణ, స్నేహితుడు పాత్ర చేసిన అలీ పాత్రలకుతగిన విధంగా నటిస్తూ లవ్‌ట్రాక్ లోకామెడితో ఆడియెన్స్‌ను బాగా నవ్వించారు. తరుణ్ అరోరా విలనిజంతో పాటు రావు రమేష్ , ప్రదీప్ రావత్‌ల విలనిజం కూడా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా రావు రమేష్ కానీ కానీ.. అంటూ యాసగా చెప్పే డైలాగ్ బావుంది. రిటైర్డ్ జడ్జ్ పాత్రలో నాజర్, పృథ్వీ అందరూ వారి వారి పాత్రలకున్యాయం చేశారు.
ఇక టెక్నికల్ విషయాలను చూస్తే దర్శకుడు కిషోర్‌పార్థసాని పవన్ ఇమేజ్ దృష్టా, కథను మలిచిన తీరు అభినందనీయం. ఫస్టాఫ్‌లో హీరోయిజం, లవ్ సీన్స్‌ను ప్రెజెంట్ చేసిన తీరు. సెకండాఫ్‌లో హీరోయిన్ ఫ్యామిలీని కాపాడే విధానం అన్నీ తెలుగు నెటివిటీకి తగిన విధంగా మలిచాడు. ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ సూపర్బ్. ప్రతి సీన్ ఎంతో కొత్తగా కనపడింది. అనూప్ ట్యూన్స్ బాగానే ఉన్నాయి. పాటలు చూడటానికి బాగానే ఉన్నాయి. అవి కథలో ప్లేస్‌మెంట్ చేసిన విధానం ఆకట్టుకోదు. ఇక సెకండాఫ్ సాగదీసినట్టుగా ఉంది. అనూప్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా కొన్ని సీన్స్‌లో బాగానే ఉన్నా, కొన్సి సీన్స్లో ఆకట్టుకోలేదు. ఎంత మంది ఉన్నారని కాదు. ఎవరున్నానేదే ముఖ్యం, భూమి అంటే హోదా కాదు, బాధ్యత, నాకు కొడుకులాంటి అల్లుడుని తెస్తావనుకుంటే నా ఆశయానికి అండను తెచ్చావు. సహా చాలా డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.
బోటమ్ లైన్: 'కాటమరాయుడు'... గెలిచి నిలిచాడు...
Katamarayudu English Version Review
- Read in English