Telangana TDP: తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీపై కాసాని జ్ఞానేశ్వర్ క్లారిటీ
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ ఎన్నికల్లో పోటీకి టీడీపీ దూరంగా ఉందనే ప్రచారంపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలనే కుట్ర ప్రకారం విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయాడనికి టీ టీడీపీ నేతలు సిద్ధమయ్యారని.. 75 మంది అభ్యర్థుల జాబితా కూడా సిద్ధమైందని ఆయన తెలిపారు. ఇటు తెలంగాణలో అటు ఏపీలో తమ పార్టీకి మంచి బలం ఉందన్నారు. మొత్తం 119 సీట్లలో పోటీ చేసే అవకాశం కూడా లేకపోలేదని పేర్కొన్నారు. రేపు(బుధవారం) చంద్రబాబుతో జైలులో ములాఖత్ అయి అభ్యర్థులను ప్రకటిస్తామని స్పష్టం చేశారు. అన్ని జిల్లాల్లో టీడీపీ జెండా ఎగరాలన్నదే తన ఆశ, తపన అని చెప్పారు.
టీడీపీ-బీజేపీ-జనసేన కలిసి పోటీ చేస్తాయనే ప్రచారం..
అయితే టీడీపీ-బీజేపీ-జనసేన కలిసి పోటీ చేస్తాయనే ఓవైపు ప్రచారం జరుగుతోంది. ఇటీవల కేంద్ర హోమంత్రి అమిత్ షాను తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డితో కలిసి నారా లోకేష్ కలిశారు. ఆ సమావేశంలో టీడీపీతో పొత్తుపై చర్చలు జరిగాయని అంటున్నారు. అయితే కిషన్ రెడ్డి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో సమావేశమై మద్దతు కోరారు. రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని భావిస్తున్నారు. తాజాగా బీజేపీ 52 మందితో కూడిన అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది. అయితే జనసేనకు 12 సీట్లు కేటాయిస్తున్నట్లుగా సోషల్ మీడియాలో వాదనలు జరుగుతున్నాయి. కానీ టీడీపీతో పొత్తుపై మాత్రం స్పష్టత రాలేదు.
చంద్రబాబులో ములాఖత్ తర్వాత తుది నిర్ణయం..
దీంతో టీడీపీ నేతలు ఒంటరిగానే పోటీకి దిగాలని భావిస్తున్నారు. పలు నియోజకవర్గాల్లో ఇప్పటికే ప్రచారాలు కూడా చేసుకుంటున్నరు. బుధవారం చంద్రబాబును కలిసిన తర్వాత తుది నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. అంతకుముందు చంద్రబాబుతో ములాఖత్ అనంతరం టీడీపీ 87 స్థానాల్లో పోటీ చేస్తుందని కాసాని జ్ఞానేశ్వర్ ప్రకటించారు. అయితే అభ్యర్థుల పేర్లు మాత్రం ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో టీడీపీ పోటీలో ఉండటం లేదనే వార్తలు పుట్టుకొచ్చాయి. తాజాగా ఆ వార్తలను కాసాని ఖండించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments