దక్షిణాది లేడీ సూపర్‌స్టార్‌గా నయనతారకు ప్రేక్షకుల్లో చాలా మంచి క్రేజ్ ఉంది. ఒక వైపు హీరోయిన్‌గా నటిస్తూనే లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నయనతార నటిస్తుంది. ఈ క్రమంలో నయనతార నటించిన మహిళా ప్రధాన చిత్రం `కర్తవ్యం`. తమిళంలో `ఆరమ్` పేరుతో విడుదలైన ఈ చిత్రం అక్కడ మంచి విజయాన్ని సాధించింది. బోరు బావిలో పడి చిన్నారుల చనిపోతున్నా కూడా ప్రభుత్వాలు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నాయనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రమిది. మరి ఓ జిల్లా కలెక్టర్ అలాంటి ఓ ఘటన వల్ల ఎలాంటి నిర్ణయం తీసుకుందనే కథతో రూపొందిన కర్తవ్యం సినిమా తెలుసుకోవాలంటే కథలో ఓ లుక్కేద్దాం...
కథ:
మధు వర్ధిని (నయనతార) నెల్లూరు జిల్లా కలెక్టర్. ప్రజా సమస్యల్లో ప్రజలకు తోడుగా నిలబడే మనస్తత్వమున్న వ్యక్తి మధు. నెల్లూరు జిల్లా తీవ్రమైన నీటి కరువు ఎదుర్కొంటున్న సమయంలో ఓ గ్రామానికి తన అధికారాన్ని ఉపయోగించి నీళ్లు వచ్చేలా చేస్తుంది. అదే సమయంలో వెలనాడు అనే గ్రామంలో రాము(రామచంద్రన్ దొరైరాజ్), సుమతి (సును లక్ష్మి) అనే దంపతులు కూలీ, నాలీ చేసుకుని జీవనం సాగిస్తుంటారు. వీరికి ఓ కొడుకు (విఘ్నేశ్).. కుమార్తె ధన్సిక(మహాలక్ష్మి ఉంటారు. ఐదేళ్ల ధన్సిక ఓ రోజు ఆడుకుంటూ పొలంలో మూయకుండా ఉన్న బోరుబావిలో పడిపోతుంది. దాంతో గ్రామ ప్రజలు ఏం చేయలో తెలియక ప్రభుత్వ పెద్దలకు విన్నవిస్తారు. విషయం తెలుసుకున్న మధు వర్ధిని గ్రామ వి.ఎ.ఒ సహా అందరినీ అలర్ట్ చేసి ఆ చిన్నారిని బ్రతికించేందుకు స్వయంగా ఘటనా స్థలంలోకి వెళుతుంది. చిన్నారిని బ్రతికించేందుకు ఆర్మీ, అగ్నిమాపక సిబ్బంది సహా అందరూ ప్రయత్నిస్తారు. అందరి ప్రయత్నాలు విఫలమవుతాయి. మరి అప్పుడు మధు వర్ధిని ఏం చేసింది? చిన్నారి బ్రతికిందా? లేదా? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
సమాజంలో పేద ప్రజలు చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా గ్రామ ప్రజలు అధికారుల నిర్లక్ష్యానికి గురవుతుంటారు. గ్రామ ప్రజలు ఎదుర్కొనే తాగునీటి సమస్యతో పాటు.. బోరుబావిలో చిన్నారుల మరణాలు అనే రెండు పాయింట్స్‌ను తీసుకుని దర్శకుడు గోపీనైనర్ కథను సిద్ధం చేసుకున్నారు. తన కథలో దర్శకుడు ఎక్కడా డైవర్ట్ కాలేదు. చెప్పాలనుకున్న విషయాల చుట్టూనే సినిమాను నడిపించాడు. మంచి పాయింట్‌కు ఆసక్తికరమైన కథను చేసుకుని గ్రిప్పింగా తెరకెక్కించాడు దర్శకడు గోపి. గోపీ తయారు చేసుకున్న కథలో మహిళ ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాబట్టి తన కథకు తగ్గట్లు నయనతారను ఎంపిక చేసుకోవడం దర్శకుడి సక్సెస్. అలాగే నయనతార కలెక్టర్ పాత్రలోఒదిగిపోయింది. కమాండింగ్ కలెక్టర్ పాత్రలో ప్రజల సమస్యలు తెలుసుకుని వారికి సహాయపడటం.. వారు భావోద్వేగాలకు గురైనప్పుడు వారికి సర్దిచెప్పడం.. ఇలా నయనతార పాత్రను పవర్‌ఫుల్‌గా ముందుకు తీసుకెళ్లడంతో సక్సెస్ అయ్యారు. బోరుబావిలో పడ్డ చిన్నారి తల్లిదండ్రుల నిస్సహాయతను రామచంద్రన్, సునై లక్ష్మిలు మంచి నటనతో వ్యక్తపరిచారు. ఇక చిన్నపిల్లలుగా నటించిన విఘ్నేశ్, మహాలక్ష్మిలు కూడా చక్కగా నటించారు. ఓం ప్రకాశ్ సినిమాటోగ్రఫీ... జిబ్రాన్ సంగీతం సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. ఎడిటింగ్ కూడా బావుంది. ప్రజలు తాగు నీటి సమస్యతో పడే ఇబ్బందులు.. బోరుబావిలో పడ్డ చిన్నారులను ఎలా కాపాడుతారనే సన్నివేశాలను చక్కగా సినిమాలో చూపించారు. సినిమాలో ఎమోషన్స్ డోస్ మరీ ఎక్కువైనట్లు ఉండటం తెలుగు ప్రేక్షకుడికి కనెక్ట్ అవుతుందా అనే సందేహం కలుగుతుందేమో కానీ కాన్సెప్ట్ పరంగా అందరినీ టచ్ చేసే కథాంశంతో తెరకెక్కింది. అసలు ప్రజలకు కావాల్సింది... సమస్యలను తీర్చే నాయకులు అనే చెబుతూ ఇచ్చిన ముగింపు ఆకట్టుకుంటుంది.
బోటమ్ లైన్: 'కర్తవ్యం'... ఆలోచింపచేసే ఎమోషనల్ కాన్సెప్ట్
Comments