ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీకి తొలి 'వీసీ'గా కరణం మల్లీశ్వరి!
- IndiaGlitz, [Wednesday,June 23 2021]
తెలుగు తేజం కరణం మల్లీశ్వరి ఖాతాలో మరో ఘనత చేరింది. ఒలంపిక్స్ లో ఇండియా తరుపున మెడల్ సాధించిన తొలి మహిళ కరణం మల్లీశ్వరి. వైట్ లిఫ్టింగ్ లో ఆమె ఎన్నో ఘనతలు సాధించింది. కరణం మల్లీశ్వరి తన ప్రతిభకు గాను ఎన్నో అవార్డులు దక్కించుకుంది.
ఇదీ చదవండి: జీవిత డేరింగ్ డెసిషన్.. ప్రకాష్ రాజ్, విష్ణుపై పోటీ?
తాజాగా ఆమె ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీకి మొట్టమొదటి వైస్ ఛాన్సలర్ గా నియమితులయ్యారు. ఈ మేరకు ఢిల్లీ లెఫ్టనెంట్ గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. 2019లో ఢిల్లీ ప్రభుత్వం క్రీడా యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. క్రికెట్, ఫుట్ బాల్, హాకీ తో పాటు మరిన్ని క్రీడల్లో ఈ యూనివర్సిటీ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, డాక్టరేట్ డిగ్రీ లని ఆఫర్ చేస్తుంది.
కరణం మల్లీశ్వరి 2000 సిడ్నీ ఒలంపిక్స్ లో 130 కేజీ వైట్ లిఫ్టింగ్ విభాగంలో కాంస్య పతకం సాధించింది. దీనితో ఇండియా తరుపున ఒలంపిక్స్ లో మెడల్ సాధించిన తొలి మహిళగా మల్లీశ్వరి రికార్డు సృష్టించింది. అంతకు ముందే ఆమె 1994, 1995 వరల్డ్ ఛాంపియన్ షిప్, ఆసియా ఛాంపియన్ షిప్ లలో మెడల్స్ సాధించింది.
1994లో అర్జున అవార్డు దక్కించుకున్న మల్లీశ్వరి, 1999లో రాజీవ్ ఖేల్ రత్న అవార్డు దక్కించుకుంది. అదే ఏడాది భారత ప్రభుత్వం ఆమెని పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.