Bandi Sanjay:బండి సంజయ్‌కి ఊరట.. జాతీయ స్థాయిలో కీలక పదవి, బీజేపీ అధిష్టానం ఉత్తర్వులు
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా పార్టీని ఒంటి చేత్తో నడిపించడమే కాకుండా పలు ఎన్నికల్లో అనూహ్య విజయాలు సొంతం చేసుకున్నారు బండి సంజయ్. తెలంగాణ బీజేపీ చరిత్రలో ఈ స్థాయిలో పార్టీకి ఆదరణ దక్కడం ఇదే ప్రథమం. ఈసారి ఎన్నికల్లో బీఆర్ఎస్కు బీజేపీ ప్రధాన ప్రత్యర్ధిగా అవతరిస్తుంది అనుకుంటున్న దశలో బండి సంజయ్‌ని అధ్యక్ష పదవి నుంచి తప్పించి ఆయన స్థానంలో కిషన్ రెడ్డికి పగ్గాలు అప్పగించారు. అలాగే ఈటల రాజేందర్‌ను పార్టీ ఎన్నికల కమిటీ ఛైర్మన్‌గా నియమించారు. మరి బండి సంజయ్ సంగతి ఏంటీ అని మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఈ పరిణామాలతో సంజయ్ వర్గం తీవ్ర అసంతృప్తికి గురైంది. అలాగే బీజేపీ శ్రేణులు కూడా నైరాశ్యంలో మునిగిపోయారు.
సంజయ్, డీకే అరుణలకు జాతీయ కార్యవర్గంలో చోటు :
ఈ నేపథ్యంలో బీజేపీ అధిష్టానం స్పందించింది. బండి సంజయ్‌ను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ఇవాళ పార్టీ జాతీయ కార్యవర్గాన్ని బీజేపీ అధిష్టానం పునరుద్ధరించింది. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి పలువురికి స్థానం దక్కింది. మాజీ మంత్రి డీకే అరుణను జాతీయ ఉపాధ్యక్షురాలిగా , ఏపీ నుంచి సత్యకుమార్‌ను ప్రధాన కార్యదర్శిగా నియమించారు. సత్యకుమార్‌ను అప్పట్లో ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నియమిస్తారన్న ప్రచారం జరిగింది. కానీ ఆ పదవి పురందేశ్వరికి దక్కడంతో సత్యకుమార్‌ను జాతీయ ప్రధాన కార్యదర్శిగా కంటిన్యూ చేస్తున్నారు.
కిషన్ రెడ్డినైనా ప్రశాంతంగా పనిచేయనివ్వాలన్న సంజయ్ :
ఇకపోతే.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ నెల 21న ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్, విజయశాంతి, తరుణ్ చుగ్ తదితరులు హాజరై కిషన్ రెడ్డికి అభినందనలు తెలియజేశారు. ఆ సమయంలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. తనపై కొందరు ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదు చేశారని.. కనీసం కిషన్ రెడ్డినైనా ప్రశాంతంగా పని చేసుకోనివ్వాలంటూ ఆయన వ్యాఖ్యానించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments