వైద్య సిబ్బందికి ప్యూమా టీ షర్టులు అందజేసిన కరీనా..

  • IndiaGlitz, [Friday,September 04 2020]

కరోనా మహమ్మారిపై యుద్ధంలో ఫ్రంట్‌లైన్‌లో ఉండి వైద్య సిబ్బంది సేవలందిస్తున్న విషయం తెలిసిందే. దేశంలోకి కరోనా వైరస్ ప్రవేశించిన నాటి నుంచి వారు నిర్విరామంగా పని చేస్తూనే ఉన్నారు. వారి ప్రాణాలతో పాటు వారి కుటుంబ సభ్యుల ప్రాణాలను సైతం రిస్క్‌లో పెట్టి మరీ ప్రజల ప్రాణాలను కాపాడుతున్నారు. ఈ కరోనాపై యుద్ధంలో చాలా మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

ప్రపంచ ఆరోగ్య సంక్షోభంపై పోరాడుతున్న వైద్యుల కృషిని స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఖాన్ ప్రశంసించారు. న్యూ ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌‌తో పాటు ముంబైలోని లోక్మాన్య తిలక్ మున్సిపల్ జనరల్ హాస్పిటల్, బెంగుళూరులోని సాక్రా వరల్డ్ హాస్పిటల్‌కు చెందిన వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలకు ప్యూమా కంపెనీకి చెందిన యాంటీ మైక్రోబియల్ టీ-షర్టులను అందించి వారికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

ఫ్రంట్‌లైన్ కార్మికులను రక్షించడంలో పీపీఈ కిట్లు ధరించడం చాలా కీలకమని కరీనా పేర్కొన్నారు. అయితే ఈ పీపీఈ కిట్లను గంటల పాటు ధరించడమనేది అంత తేలికైన పనేమీ కాదని ఆమె అభిప్రాయపడ్డారు. చాలా అసౌకర్యంగా అనిపిస్తుందన్నారు. అయితే ప్యూమా కంపెనీకి చెందిన యాంటీ మైక్రోబియల్ టీ-షర్టులు.. పీపీఈ కిట్‌లను ధరించడంలో ఏమాత్రం ఇబ్బంది లేకుండా చేస్తాయని కరీనా తెలిపారు. ఈ టీషర్టులు సూక్ష్మ జీవుల పెరుగుదలను నియంత్రిస్తామని ఆమె వెల్లడించారు.