పవన్‌ను తిడతారా.. 2024లో అనుభవిస్తారు: జగన్‌కు కాపు సంక్షేమ సేన హెచ్చరిక
- IndiaGlitz, [Wednesday,September 29 2021]
‘రిపబ్లిక్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఊపేస్తున్నాయి. ఆ రోజు మొదలు ఇప్పటి వరకు జనసేన, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం భీకరంగా సాగుతోంది. ఏపీ మంత్రులందరూ మూకుమ్మడిగా పవన్ కళ్యాణ్‌పై విరుచుకుపడుతున్నారు. చిత్ర పరిశ్రమ, ఆన్లైన్ టికెట్ బుకింగ్ వంటి అంశాల్లో ఏపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఆ రాష్ట్ర మంత్రులు తీవ్రంగా ఖండించారు.
మంత్రులంతా సన్నాసులు అంటూ పవన్ చేసిన తీవ్ర వ్యాఖ్యలకు.. మంత్రులు సైతం అంతే ఘాటుగా రిప్లై ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ వ్యాఖ్యలపై సినీనటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి కూడా తీవ్రస్థాయిలో విరుచుకుపడిన విషయం తెలిసిందే. దీంతో పవన్ ఫ్యాన్స్ తనని టార్గెట్ చేసి తన కుటుంబంపై అసభ్యకర మెసేజ్‌లు పెడుతున్నారని పోసాని ప్రెస్ మీట్ పెట్టి మరీ మరోసారి పవర్‌స్టార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది అసలే ఉప్పు నిప్పుగా వున్న వ్యవహారంలో మరింత అగ్గిని రాజేసింది. నిన్న హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో పోసాని మీడియా సమాశం అయినవెంటనే కాపు సంక్షేమ సేన రంగంలోకి దిగింది.
కాపు మంత్రులు పవన్‌ను తిట్టడం వెనక ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందని ఆరోపించింది. పవన్‌ను అవమానించడం అంటే.. కాపు సమాజాన్ని అవమానపరచడమేనని స్పష్టం చేసింది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వీటి పర్యవసానాన్ని సీఎం జగన్ ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ఈ మేరకు కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ మంత్రి హరిరామజోగయ్య పేరిట ఓ లేఖ విడుదల చేశారు. ఇలాంటి ఉద్రిక్తత పరిస్ధితుల నేపథ్యంలో పవన్‌కల్యాణ్ బుధవారం మంగళగిరి వస్తుండటంతో ఏం జరుగుతుందోనని రెండు రాష్ట్రాల్లో ఉత్కంఠ నెలకొంది.