Kapu Ramachandra Reddy: జగన్‌ను నమ్మి సర్వనాశనం అయ్యా.. వైసీపీకి మరో ఎమ్మెల్యే రాజీనామా..
Send us your feedback to audioarticles@vaarta.com
ఇంఛార్జ్‌ల మార్పు అధికార వైసీపీలో తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా పార్టీకి రాజీనామా చేసి బయటకు వెళ్తున్నారు. తాజాగా సీఎం జగన్ సన్నిహిత ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి(Kapu Ramachandra Reddy) రాజీనామా చేయడం వైసీపీలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిలో భేటీ అయిన ఆయనకు టికెట్ లేదని తేల్చి చెప్పడంతో ఆగ్రహంతో బయటకు వచ్చేశారు.
అనంతరం రామచంద్రారెడ్డి మాట్లాడుతూ "జగన్‌ను గుడ్డిగా నమ్మితే.. నమ్మించి గొంతు కోశారు. దరిద్రపు సర్వేల పేరుతో టికెట్ లేకుండా చేశారు. కనీసం జగన్‌ను కలిసేందుకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఇంతకంటే ఘోర అవమానం ఉండదు. జగన్ కోసం కాంగ్రెస్ పార్టీనీ, పదవిని వదులుకుని వచ్చాను. మంత్రి పదవి ఇస్తామన్నారు. ఇవ్వలేదు. ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ కూటా లేదంటున్నారు. ఐదేళ్లలో జగన్ ఏం చెబితే అది చేశాం. ఎంతో కష్టపడి పని చేశాం. మంచి జరిగినా.. చెడు జరిగినా జగన్ వల్లే. అలాంటిది నాకు టికెట్ లేదని చెప్పడం బాధగా ఉంది. ఏదైనా పార్టీ టికెట్ ఇస్తే రాయదుర్గం, కళ్యాణదుర్గం నుంచి నేను, నా భార్య పోటీ చేస్తాం. లేదంటే స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తాం" అని వెల్లడించారు.
కాగా జగన్ వైసీపీ పార్టీ పెట్టినప్పుడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కాపు రామచంద్రారెడ్డి ఆయనతో పాటు నడిచారు. అప్పటి నుంచి జగన్‌తో సన్నిహితంగా ఉంటున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో టికెట్ లేదని చెప్పడం ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. మొత్తానికి టికెట్ దక్కని నేతలు జగన్‌పై భగ్గుమంటున్నారు. ఏకంగా పార్టీకి రాజీనామా చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది నేతలు పార్టీకి రాజీనామా చేయగా.. మూడో జాబితా రిలీజ్ అయ్యాక ఇంకెంత మంది రాజీనామా చేస్తారో అనే ఉత్కంఠ వైసీపీ క్యాడర్‌లో నెలకొంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments