Mudragada:ముద్రగడకు కాలింది : ఎంతమంది తొక్క తీశారు.. ఎంతమందికి గుండు గీయించారు , చెప్పండి పవన్
Send us your feedback to audioarticles@vaarta.com
ముద్రగడ పద్మనాభం.. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఉద్యమ నేతగా ఆయనకు అపార అనుభవం వుంది. కాపు రిజర్వేషన్ కోసం ముద్రగడ అవిశ్రాంతంగా పోరాడుతున్నారు. ఆయన మాటంటే కాపు సామాజికవర్గంలో గురి వుంది. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీరును ముద్రగడ పద్మనాభం ఎండగట్టారు. తనదైన శైలిలో చురకలంటిస్తూ , పవన్ రాజకీయంలోని లోపాలను ఎత్తిచూపుతూ ఓ లేఖ వదిలారు. కాపు ఉద్యమాన్ని ఏనాడు తన ఎదుగుదలకు వాడుకోలేదని.. చిత్తశుద్ధితోనే తన పోరాటాన్ని కొనసాగిస్తున్నట్లు ముద్రగడ స్పష్టం చేశారు. పార్టీ పెట్టి పది మంది ప్రేమాభిమానాలను పొందాలే కానీ.. ఇలా వీధి రౌడీలా మాట్లాడటం కరెక్ట్ కాదని పద్మనాభం చురకలంటించారు. కులాన్ని అడ్డుపెట్టుకుని పెద్ద నాయకుడిగా మారాలని అనుకోలేదని, యువతను వాడుకుని భావోద్వేగాలు రెచ్చగొట్టలేదని పద్మనాభం తెలిపారు. పవన్ నేతలను విమర్శంచడం మానేసి అసలు విషయాలపై దృష్టి పెట్టాలంటూ ముద్రగడ హితవు పలికారు.
కాపులను సీఎంని చేయమని జగన్‌ను అడిగా :
కాపు ఉద్యమాన్ని చేయాల్సిన పరిస్ధితిని తనకు చంద్రబాబు నాయుడే కల్పించారని.. తాను ఏ నాయకుడిని బెదిరించి డబ్బులు సంపాదించలేదని పద్మనాభం చురకలంటించారు. కాపు రిజర్వేషన్ అంశం తన పరిధిలో లేదని అప్పటి ప్రతిపక్షనేతగా వున్న జగన్ అన్నప్పుడు.. కాపు వర్గం నుంచి బొత్స సత్యనారయణను సీఎంను చేయమని అడిగానని ముద్రగడ గుర్తుచేశారు. కోట్లాడి రూపాయల సూట్‌కేసులకు తాను అమ్ముడుపోలేదని.. తనకంటే బలవంతులైన మీరు తాను వదిలేసిన ఉద్యమాన్ని చేపట్టి కాపు రిజర్వేషన్‌ను సాధించొచ్చుగా అంటూ ముద్రగడ చురకలంటించారు. కులాన్ని అడ్డుపెట్టుకుని తాను పఏ పదవిని పొందలేదని.. ఎవరిని బెదిరించో, డిమాండ్ చేసో డబ్బులు పొందలేదని పద్మనాభం తెలిపారు. కాపు ఉద్యమంతో తాను ఓటమికి దగ్గరయ్యానని.. దీనిని బట్టి ఎవరు కులాన్ని వాడుకున్నారో తెలుసుకోవాలని కాపు యువతకు ఆయన పిలుపునిచ్చారు.
ద్వారంపూడి తాత , తండ్రులేంటో నాకు తెలుసు :
ఎమ్మెల్యే ద్వారంపూడిని తిట్టడానికి సమయం వృదా చేయొద్దని.. ప్రత్యేక హోదా, స్టీల్ ప్లాంట్, ప్రత్యేక రైల్వే జోన్, కడప స్టీల్ ప్లాంట్ వంటి సమస్యల గురించి ఆలోచించాలని పవన్ కల్యాణ్‌కు సూచించారు. మీకు రాజకీయ సలహాలు ఎవరిస్తున్నారో కానీ, మీరు మాట్లాడే భాష పార్టీ అధనేత స్థాయికి తగ్గట్లుగా లేదని ముద్రగడ మండిపడ్డారు. తొక్క తీస్తా, నార తీస్తా, కింద కూర్చోబెడతా, గుండ్లు గీయిస్తా, చెప్పుతో కొడతా .. ఇలా వీధి రౌడీ భాషలో మాట్లాడటం సరికాదన్నరు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తాత , తండ్రులతో తనకు సన్నిహిత సంబంధాలు వున్నాయని ఆయన తెలిపారు. 1984లో నాటి సీఎం ఎన్టీఆర్ తనకు మంత్రి పదవి ఇస్తే.. తాను వద్దన్నానపని.. అప్పుడు ద్వారంపూడి తాత కృష్ణారెడ్డి, తండ్రి భాస్కర్ రెడ్డిలు నాకు నచ్చజెప్పి మంత్రి పదవి తీసుకోమన్నారని ముద్రగడ పద్మనాభం గుర్తుచేశారు.
కాపు ఉద్యమానికి ద్వారంపూడి కుటుంబం సహకరించింది :
ద్వారంపూడిది గౌరవమైన కుటుంబమన్న ఆయన.. ఎన్నికల సమయంలో లారీలు, కార్లు సమకూర్చేవారని చెప్పారు. 1988లో విజయవాడలో జరిగిన కాపునాడుకు 100 లారీలను పంపారని, కోట్ల విజయ భాస్కర్ రెడ్డి సీఎంగా వున్నప్పుడు జరిగిన ఉద్యమంలో రూ.50 వేలతో పోస్టర్లు వేయించి తనకు ఆ కుటుంబం సహాయం చేసిందని ముద్రగడ గుర్తుచేశారు. కాపు ఉద్యమానికి ఎంతో సాయం చేసిన ఆ కుటుంబాన్ని విమర్శించడం తగదని పద్మనాభం వెల్లడించారు. కాపుల తరపున చేసిన ఉద్యమాలకు మీరేందుకు రాలేదని నేను అడగనని ముద్రగడ సెటైర్లు వేశారు. అలాంటి మీరు తరచూ కాపులు పెద్దన్న పాత్ర పోషించాలని అనడం విడ్డూరంగా వుందన్నారు.
పొత్తు అంటారు.. సీఎం అంటారు , క్లారిటీ ఇవ్వండి :
కాకినాడ ఎమ్మెల్యే దొంగ అయినప్పుడు రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎందుకు గెలిచారని ముద్రగడ పద్మనాభం ప్రశ్నించారు. దుర్మార్గులను అసెంబ్లీకి పంపకుండా వారిని చిత్తుగా ఓడించడానికి ముందుకు రావాలని ఆయన పవన్‌కు సలహా ఇచ్చారు. టీడీపీ, బీజేపీలతో కలిసి పోటీ చేస్తామని చెబుతూ.. జనసేనకు మద్ధతివ్వండి, నన్ను సీఎంను చేయండని ఎలా అడుగుతున్నారో నాకు అర్ధం కావడం లేదంటూ ముద్రగడ చురకలంటించారు. 175 స్థానాలకు పోటీ చేసి అప్పుడు ముఖ్యమంత్రిని చేయమని ప్రజలను అడగాలని హితవు పలికారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments