Mudragada:వైసీపీలోకి కాపు నేత ముద్రగడ చేరిక ఖరారు..?
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీ రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. ఎన్నికలకు మూడు నెలలు మాత్రమే సమయం ఉండటంతో అభ్యర్థుల ఎంపికపై అన్ని పార్టీలు ప్రత్యేక దృష్టి పెట్టాయి. ఈ క్రమంలోనే కొంత మంది ఆశావహులు తమకు టికెట్ దక్కే పార్టీల్లోకి జంప్ అయిపోతున్నారు. తాజాగా కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. జనవరిలో ముద్రగడ వైసీపీ కండువా కప్పుకోనున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. కొంతకాలంగా ఆయన వైసీపీలో చేరతారనే ప్రచారం జోరుగా చర్చ జరుగుతోంది. ఇప్పుడు పార్టీ చేరికకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
గత టీడీపీ ప్రభుత్వంలో కాపు రిజర్వేషన్ల కోసం పెద్ద ఎత్తున పోరాటం చేశారు. ఈ క్రమంలోనే తునిలో కాపుల మీటింగ్ పెట్టిన సందర్భంలో రైలుకు మంటలు పెట్టడం సంచలనంగా మారింది. మాజీ సీఎం చంద్రబాబుతో ఢీ అంటే ఢీ అన్నట్టుగా వ్యవహరించారు. అయితే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు ఎక్కడా కాపు ఉద్యమమే చేయలేదు. పైగా ప్రభుత్వానికి మద్దతుగా ఉంటూ వ్యవహరించారు. ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్రలో భాగంగా కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై విమర్శలు చేసినప్పుడు ముద్రగడ పవన్‌పై విరుచుకుపడ్డారు.
ఈ నేపథ్యంలో టీడీపీ, జనసేన పొత్తుల కారణంగా కాపు ఓటు బ్యాంక్ చెదిరిపోకుండా ముద్రగడను పార్టీలో చేర్చుకోవాలని వైసీపీ పెద్దలు భావిస్తున్నారు. ప్రస్తుతం వచ్చే ఎన్నికల్లో అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పార్టీ అధినేత జగన్ నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో ముద్రగడ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. అయితే తన కుమారుడికి టికెట్ ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. ఇందుకు గ్రీన్ సిగ్నల్ రావడంతో ఆయన త్వరలోనే ఫ్యాన్ తీర్థం పుచ్చుకోనున్నారట. మొత్తానికి ఇన్నాళ్లూ వైసీపీకి పరోక్షంగా మద్దతు ఇచ్చిన ముద్రగడ.. ఇప్పుడు పార్టీ నేతగా మారనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments