ఇండియా మాజీ క్రికెట్ కెప్టెన్ కపిల్ దేవ్‌కు గుండెపోటు..

ఇండియా మాజీ క్రికెట్ కెప్టెన్ కపిల్ దేవ్ గుండెపోటుతో ఢిల్లీలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ఆయనకు యాంజియోప్లాస్టి చేసేందుకు వైద్యులు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఇండియన్ క్రికెట్ చరిత్రలో కపిల్‌దేవ్ ఒక గొప్ప క్రికెటర్‌గా పేరుగాంచారు. ఇండియాకు తొలి వరల్డ్ కప్ తీసుకొచ్చిన ఘనత ఆయనదే. ఒక దశాబ్దం పాటు ఆయన భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు. 1978 అక్టోబర్ 1 న క్వెట్టాలో పాకిస్థాన్‌పై భారత్ తరఫున తొలిసారి కపిల్ క్రికెట్ ఆడారు. ఆ నెల చివరిలోనే ఫైసలాబాద్‌లో టెస్ట్ అరంగేట్రం చేశారు.

131 టెస్టుల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన కపిల్ దేవ్ 434 వికెట్లు తీయడంతో పాటు 5,248 పరుగులు చేశారు. కపిల్ దేవ్ 225 వన్డేల్లో 3,783 పరుగులు చేసి 253 వికెట్లు పడగొట్టారు. ఇండియన్ క్రికెట్ చరిత్రలో తొలిసారి దేశానికి 1983లో ప్రపంచ కప్ తీసుకొచ్చారు. లార్డ్స్‌లో జరిగిన ఫైనల్‌లో భారతదేశం అన్ని నెగిటివ్స్‌ని అధిగమించి శక్తివంతమైన వెస్టిండీస్‌ను ఓడించి, చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసిన సమయంలో కూడా కపిల్ దేవ్ జట్టును ముందుండి నడిపించారు. 1994 లో ఆట నుంచి రిటైర్ అయ్యారు. అనంతరం కోచ్‌గా కపిల్ 1999లో జట్టు బాధ్యతలు స్వీకరించారు.