Kapatadhaari Review
ఒకప్పుడు కమర్షియల్ సినిమాలకు ఆదరణ దక్కే తెలుగు సినిమా ట్రెండ్ నెమ్మదిగా మారుతోంది. కొత్త కథాంశం ఉన్న సినిమాలకు ప్రేక్షకులు పట్టం కడుతున్నారు. స్టార్ హీరోలు సైతం వైవిధ్యమైన సినిమాలు, పాత్రలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. డిజిటల్ రంగం ప్రాముఖ్యత పెరగడంతో ప్రపంచ సినిమా ప్రేక్షకుడి అర చేతిలోకి వచ్చింది. అయినా కూడా ఇతర భాషల్లో విజయవంతమైన సినిమాలను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఈ క్రమంలో కన్నడ నుంచి తెలుగులోకి రీమేక్ అయిన చిత్రం ‘కపటధారి’. కన్నడలో ఘన విజయం సాధించిన ‘కావలుధారి’ చిత్రాన్ని తెలుగులో ‘కపటధారిగా రీమేక్ చేశారు. సుబ్రహ్మణ్యపురం, ఇదంజగత్ వంటి థ్రిల్లర్ చిత్రాలతో మెప్పించిన హీరో సుమంత్ మరోసారి ‘కపటధారి’ అనే థ్రిల్లర్ చిత్రంతో విజయాన్ని సొంతం చేసుకున్నాడా? లేదా? అనే విషయం తెలుసుకోవాలంటే కథేంటో చూద్దాం...
కథ:
1977లో సినిమా ప్రారంభం అవుతుంది. వరంగల్‌లోని అర్కియాలజీ డిపార్ట్‌మెంట్‌వారు జరిపిన తవ్వకాల్లో విలువైన సంపద బయటపడుతుంది. అయితే అర్కియాలజీ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఆఫీసర్‌రంగరావు ఆ సంపదను దోచుకుని కుటుంబంతో సహా పారిపోతాడు. అతని కారు ఓ ప్రమాదంలో కాలిపోతుంది.పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరక్కపోవడంతో కేసుని క్లోజ్ చేస్తారు. నలబై ఏళ్ల తర్వాత హైదరాబాద్ మెట్రో తవ్వకాల్లో మూడు అస్థి పంజరాలు బయటపడతాయి. ట్రాఫిక్ ఎస్సై గౌతమ్(సుమంత్), తనకున్న ఆసక్తితో క్రైమ్ ఇన్వెస్టిగేషన్‌లో ఇన్‌వాల్వ్ అవుతాడు. పై అధికారి వద్దని చెప్పినా కూడా కేసుని తనదైన కోణంలో ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలు పెడతాడు. నలబై ఏళ్ల క్రితం కనిపించకుండా పోయిన రంగావు కుటుంబానివే ఆ అస్థిపంజరాలని తెలుస్తాయి. నలబై ఏళ్ల క్రితం కేసుని డీల్ చేసిన పోలీస్ ఆఫీసర్ రంజిత్(నాజర్)ను కలుస్తాడు గౌతమ్. అదే సమయంలో లాకప్ అనే ఓ చిన్న పత్రిక ఎడిటర్ జీకే(జయప్రకాశ్) గౌతమ్‌కు ఎలాంటి సహాయం చేస్తాడు. జీకేకి, రంగారావు కేసుకి ఉన్న సంబంధం ఏంటి? ఇంతకు రంగారావుని ఎవరు చంపారు? గౌతమ్ హంతకుడిని కనుక్కున్నాడా అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే..
విశ్లేషణ:
థ్రిల్లర్ సినిమాల్లో సినిమాల్లో కథాంశం ఎంత ఆసక్తికరంగా మలిచారనేది ముఖ్యం. కన్నడ చిత్రం కావలుధారి కథను ఎలాంటి మార్పులు చేర్పులు లేకుండా అలాగే తీసుకున్నారు. ఓ ట్రాఫిక్ ఎస్సై నలబై ఏళ్ల క్రితం జరిగిన మూడు హత్యలు చేసిన హంతకుడిని ఎలా పట్టుకున్నాడనే పాయింట్‌ను ఆసక్తికరంగా తెరకెక్కించారు. సినిమాలో ఒక్కొక్క చిక్కుముడిని విడదీస్తూ ముందుకు నడిపిన తీరు బావుంటుంది. అయితే సినిమాలో లాజిక్ష్ మిస్ అయ్యామనే సంగతిని ఎందుకు పసిగట్టలేకపోయారు. లేకపోతే ఏముందిలే ప్రేక్షకులు చూస్తారులే అనుకున్నారో ఏమో కానీ.. కొన్ని సన్నివేశాల్లో లాజిక్స్ మిస్ అయ్యింది. సాంకేతికంగా సినిమా కాస్త స్పీడ్ చేశారు కానీ.. కన్నడకు, తెలుగుకి పెద్ద మార్పులు చేర్పులు లేవు. సైమన్ కింగ్ మాంటేజీ సాంగ్స్ కథలో భాగంగా ఉన్నాయి. నేపథ్య సంగీతం కూడా కన్నడ సినిమాలో ఉన్నట్లే అనిపించింది. సినిమాటోగ్రఫీ డిఫరెంట్‌గా ఉంది. ఓ డార్క్ షేడ్‌లో సినిమా రన్ అవుతన్నట్లు సినిమాటోగ్రఫీ చెప్పకనే చెబుతుంది. ఇక దర్శకుడు ప్రదీప్ కృష్ణమూర్తి కన్నడ సినిమాను ఫాలో అయినట్లు సుస్పష్టంగా తెలుస్తుంది. ఆయన పెద్దగా కష్టపడలేదు.
నటీనటుల విషయానికి వస్తే థ్రిల్లర్ చిత్రాలతో విజయాలను సొంతం చేసుకున్న సుమంత్ మరోసారి థ్రిల్లర్ సినిమా కపటధారితో ముందుకు వచ్చాడు. సినిమాలో ట్రాఫిక్ పోలీస్ అయిన హీరో పాత్ర ఓవర్ హీరోయిక్‌గా ఉండదు. కాబట్టి సుమంత్ చాలా సులభంగా చేసుకుంటూ వెళ్లిపోయాడు. నందితా శ్వేత పాత్రల చాలా పరిమితం. రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించిన నాజర్, జర్నలిస్ట్ పాత్రలో కనిపించిన జయప్రకాశ్ వారి వారి పాత్రల్లో ఒదిగిపోయారు. మెయిన్ విలన్‌గా నటించిన కన్నడ నటుడు కూడా చక్కగా నటించాడు.
రహస్యాలను ఎక్కడ పడితే అక్కడ, ఎవరి ముందంటే వారి ముందు మాట్లాడకూడదు. మనం ఎప్పుడో, ఎక్కడో చేసిన పనులు మనకు మరో రూపంలో ఎదురవుతాయనే కాస్మిక్ నియమం కూడా సినిమాలో మనకు కనిపిస్తుంది.
బోటమ్ లైన్: కపటధారి.. థ్రిల్లర్ చిత్రాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది
- Read in English