ప్రముఖ దక్షిణాది నటుడు గిరీశ్ కర్నాడ్ కన్నుమూత
- IndiaGlitz, [Monday,June 10 2019]
ప్రముఖ దక్షిణాది నటుడు, ప్రముఖ సినీ, రంగస్థల నటుడు, దర్శకుడు, రచయిత గిరీశ్ కర్నాడ్ (81) తుదిశ్వాస విడిచారు. సోమవారం ఉదయం బెంగళూరులోని తన స్వగృహంలో కర్నాడ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగళూరులో చికిత్స తీసుకుంటున్నారు. ఇవాళ ఉదయం పరిస్థితి విషమించి ఇవాళ ఉదయం 6.30 గంటల సమయంలో మరణించినట్లు కుటుంబ సభ్యులు మీడియాకు తెలిపారు.
మహారాష్ట్రలోని మాతేరన్‌లో 1938 మే 19న గిరీశ్ కర్నాడ్ జన్మించారు. కన్నడలో పలు నాటకాలు రచించి ఎందర్నో మెప్పించి కర్నాడ్ వెలుగులోకి వచ్చారు. 1970లో ‘సంస్కారా’ అనే చిత్రం ద్వారా ఆయన సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అనంతరం తర్వాత కన్నడ, హిందీ, తమిళం, మలయాళం సినిమాల్లో ఆయన నటించి మెప్పించి ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు. మద్రాస్‌లో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్‌లో పని చేస్తున్న సమయంలో డా.సరస్వతి గణపతిని ఆయన ఓ పార్టీలో కలుసుకున్నారు. దాదాపు పది సంవత్సరాల తర్వాత వాళ్లు వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం.
తెలుగు చిత్రాల్లో...!
వెంకటేశ్ హీరోగా నటించిన ‘ధర్మ చక్రం’ అనే సినిమా ద్వారా 1996లో గిరిశ్ తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత ‘శంకర్ దాదా-ఎంబీబీఎస్’, ‘కొమరం పులి’, ‘స్కెచ్ ఫర్ లవ్’ సినిమాల్లో ఆయన నటించి సినీ ప్రియులు ఆదరాభిమానాలు పొందారు. గిరీశ్ చివరిగా అప్నా దేశ్ అనే కన్నడా సినిమాలో కనిపించారు.
అవార్డులు..
1972లో గిరీశ్ కర్నాడ్‌కు బీవీ కారంత్‌తో కలిపి 'వంశ వృక్ష' అనే కన్నడ చిత్రానికి ఉత్తమ దర్శకునిగా జాతీయ అవార్డును అందుకున్నారు. 1974లో పద్మశ్రీ, 1992లో పద్మ భూషణ్‌లు ఆయన్ను వరించాయి. సినిమాలకు సంబంధించి మొత్తం ఏడు ఫిలింఫేర్ అవార్డులు, 10 జాతీయ అవార్డులు దక్కించుకున్నారు. 1998లో జ్ఞానపీఠ్ అవార్డుతో పాటు ఎన్నో అవార్డులను గిరీశ్‌ను వరించాయి.
ప్రముఖుల సంతాపం..
గిరీశ్ కర్నాడ్ మృతిపై పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. కర్నాటక మాజీ సీఎం సిద్ధరామమయ్య, కర్నాటక బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్పతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు గిరీశ్ మృతికి సంతాపం తెలిపి ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. కాగా రేపు మధ్యాహ్నం గిరీశ్ అంత్యక్రియలు జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ అంతిమ సంస్కారాలకు తెలుగు ఇండస్ట్రీతో పాటు పలువురు దక్షిణాది నటీనటులు తరలివెళ్లనున్నారు.