Actress Abhinaya: కట్నం కోసం వదినకు వేధింపులు.. సీనియర్ నటి అభినయకు రెండేళ్ల జైలు
Send us your feedback to audioarticles@vaarta.com
వరకట్న వేధింపుల కేసులో సీనియర్ నటి అభినయ (Kannada Senior Actress Abhinaya) జైలు పాలయ్యారు. వివరాల్లోకి వెళితే.. అభినయ సోదరుడు శ్రీనివాస్‌కు లక్ష్మీదేవి అనే మహిళతో 1998లో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో లాంఛనాల కింద రూ.80 వేల నగదు, 250 గ్రాముల బంగారు ఆభరణాలను అమ్మాయి తరపువారు అందజేశారు. అయితే ఆ తర్వాత మరో లక్ష కట్నాన్ని తీసుకురావాలంటూ అభినయ తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తోందంటూ 2002లో బెంగళూరు చంద్రా లే ఔట్ ఠాణాలో లక్ష్మీదేవి ఫిర్యాదు చేశారు. పెళ్లయిన ఆరు నెలల నుంచే తనను వేధించడం మొదలుపెట్టారని ఆమె పేర్కొన్నారు.
కింది కోర్ట్, జిల్లా.. చివరికి హైకోర్టుకు చేరిన కేసు:
దీనిపై సుదీర్ఘ విచారణ అనంతరం 2012లో కింది కోర్ట్ అభినయ సహా ఐదుగురికి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే వీరంతా జిల్లా కోర్టుకు అప్పీల్‌కు వెళ్లడంతో .. న్యాయస్థానం కిందికోర్ట్ శిక్షను రద్దు చేసింది. దీనిని బాధితురాలు లక్ష్మీదేవి కుటుంబం హైకోర్టులో సవాల్ చేయగా, న్యాయస్థానం అభినయ, ఇతర కుటుంబ సభ్యులను దోషులుగా తేల్చింది. లక్ష్మీదేవి భర్త శ్రీనివాస్, అత్తమామలు జయమ్మ, రామకృష్ణలకు ఐదేళ్ల చొప్పున.. శ్రీనివాస్ సోదరుడు చలువరాజ్‌కు మూడేళ్లు, అభినయకు రెండేళ్లు జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి జస్టిస్ హెచ్ బీ. ప్రభాకర శాస్త్రి తుది తీర్పు వెలువరించారు.
20 ఏళ్ల తర్వాత బాధితురాలికి న్యాయం:
మరోవైపు .. హైకోర్టు తీర్పుపై లక్ష్మీదేవి హర్షం వ్యక్తం చేశారు. అత్తింట్లో తాను ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నట్లు గుర్తుచేసుకున్నారు. రెండు దశాబ్ధాల తర్వాత తనకు న్యాయం జరిగిందని లక్ష్మీదేవి కన్నీటి పర్యంతమయ్యారు.
అప్పట్లో రంభపైనా వరకట్న వేధింపుల కేసు:
ఇదిలావుండగా... గతంలో సీనియర్ హీరోయిన్ రంభ కూడా వరకట్న వేధింపుల కేసును ఎదుర్కొన్నారు. రంభ అన్న శ్రీనివాసరావుకు పల్లవితో వివాహం జరిగింది. ఈ క్రమంలో తనను అత్తమామలు, భర్త, ఆడపడుచు రంభ వేధిస్తున్నారంటూ నాంపల్లి మూడో చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం సంచలనం కలిగించింది. దీనిపై న్యాయస్థానం రంభ కుటుంబ సభ్యులకు సమన్లు సైతం జారీ చేసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments