బీజేపీ నుంచి కన్నా ఔట్.. త్వరలో వైసీపీలోకి!
Send us your feedback to audioarticles@vaarta.com
అవును మీరు వింటున్నది నిజమే.. కన్నా లక్ష్మీనారాయణను ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని ఢిల్లీ అధిష్టానం యోచిస్తోందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇందుకు కారణం ఆయనపై వచ్చిన ఆరోపణలే.
ఒక్క ఆరోపణలేనా అంటే కానేకాదు.. నిధుల దుర్వినియోగం.. టికెట్లు అమ్ముకోవడం.. కార్యకర్తలను పట్టించుకోకపోవడం ఇలా చాలానే ఉన్నాయట. ఇంతకీ వీటన్నింటికీ ప్రధాన కారణాలేంటి..? ఏపీ బీజేపీలో అసలేం జరుగుతోందో ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కన్నాలక్ష్మీనారాయణ బాధ్యతలు చేపట్టి సరిగ్గా ఏడాది పూర్తయ్యింది. ఎన్నోవివాదాలు.. ఎంతో మంది ఈ పదవి కోసం క్యూ కట్టగా ఆఖరికి కన్నాకు పదవి కట్టబెట్టింది ఢిల్లీ అధిష్టానం. అనుభవం ఉన్న నేత.. పైగా కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగు వెలిగిన నేత కదా అని అక్కరకు తెచ్చుకుని మరీ పదవి కట్టబెడితే ఇంత వరకూ ఆయన చేసిందేంటి..? కనీసం పార్టీని బలోపేతం చేయడానికి కన్నా ఇంత వరకూ తీసుకున్న చర్యలేంటి..? అసలు ఈ ఏడాది కాలంలో ఫలానా పని చేశానని చెప్పమనండి..? అని సొంత పార్టీ నేతలు, కార్యకర్తలు కాకులు పొడిచినట్లు పొడుస్తున్న పరిస్థితి. బహిరంగంగానే పలువురు బీజేపీకి చెందిన నేతలు తమ ఆక్రోశాన్ని వెల్లగక్కారు. అయితే ఈ ప్రశ్నలకు కన్నా స్పందించి రియాక్ట్ అవుతారా..? లేకుంటే మిన్నకుండిపోయి తిన్నగా తన పని తాను చేసుకుని పోతారా..? లేకుంటే పూర్తిగా పార్టీనే వదిలేసి వేరే పార్టీలో చేరతారా అన్నది ఇక్కడ అప్రస్తుతం.. అనవసరం కూడా.
ఆఖరి క్షణంలో అసలేమైంది..!
కన్నా పదవీ బాధ్యతలు చేపట్టకు మునుపు పార్టీ కాస్తో కూస్తో మెరుగ్గానే ఉండేదని.. ఆయనకు పగ్గాలు ఇచ్చాక పార్టీ సర్వనాశనం అయిపోయిందని ఓ సమీక్షా సమావేశంలో సొంత పార్టీ నేతలే అనుకుంటున్న మాట ఇది. మరీ ముఖ్యంగా వైసీపీ నేతలతో కుమ్ముక్కై కడప జిల్లా రాజంపేట ఎంపీ టికెట్టు అమ్ముకున్నారని.. ఆఖరి క్షణంలో అభ్యర్థి పోటీ నుంచి తప్పుకున్నాడని బీజేపీ నాయకులు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. రాజంపేట ఎంపీ టికెట్ వైసీపీ నాయకుడు మహేశ్వర్ రెడ్డికి ఇవ్వగా ఆయన ఆఖరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన తప్పుకపోవడం వెనుక బీజేపీ నేతల హస్తం ఉందని.. ఇందుకు సంబంధించిన ఆడియో టేపులు కూడా మా దగ్గరున్నాయని బీజేపీ నేతలు గగ్గోలు పెడుతున్నారు.
నిధులు దారి తప్పాయ్!
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల కోసం అధిష్టానం ఇచ్చిన డబ్బులను సైతం పక్కదారి పట్టించేశారట. ఇలా కన్నాపై వస్తున్న ప్రతీ ఆరోపణను పరిగణనలోనికి తీసుకుని అధిష్టానం ఆయన్ను విచారించాలని ఏపీ బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. సో.. కచ్చితంగా ఏపీపై బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఓ కన్నేయాలని.. వీలైనంత త్వరలోనే ఏపీకి వచ్చి కన్నా మ్యాటర్ సెటిల్ చేయాలని ఇప్పటికే నేతలు ఢిల్లీకి వినతులు పంపారట. కచ్చితంగా షా వస్తారని.. వచ్చి ఈ వ్యవహారాలన్నీ తేలుస్తారని ఏపీ కమలనాథులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
వైసీపీ తీర్థం పుచ్చుకుంటారా!
కాగా.. కన్నా ఏపీ బాధ్యతలు చేపట్టక మునపు వైసీపీ తీర్థం పుచ్చుకోవాలని సిద్ధమయ్యారు. అంతా అనుకున్నట్లు జరిగితే మరికొన్ని గంటల్లోనే వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆఖరి నిమిషంలో అమిత్ షా రంగంలోకి దిగడంతో సీన్ కాస్త మారిపోయింది. దీంతో కన్నా వైసీపీలో చేరిక ఆగిపోయింది.
అయితే ఈ మధ్య కన్నాపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో పార్టీ కోసం ఇంత కష్టపడినప్పటికీ.. బలోపేతం చేయాలని శాయశక్తులా ప్రయత్నించినప్పటికీ చివరికి తనపైనే ఇలా ఆరోపణలు రావడమేంటని తీవ్ర ఆవేదనకు లోనైనట్లు తెలుస్తోంది. బీజేపీలో ఇంత జరిగిన తర్వాత కూడా ఇంకా పార్టీలో కొనసాగడం అనవసరమని.. వైసీపీ గూటికి చేరాలని సన్నిహితులతో చర్చించినట్లు లీకులు వస్తున్నాయి.
అయితే ఏపీ ఫలితాలు తర్వాత ముహూర్తం ఫిక్స్ చేసుకొని వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోవాలని.. తనతో పాటు పలువురు నేతలను సైతం పార్టీలో చేర్చాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఇదే నిజమైతే ఏపీలో బీజేపీ పరిస్థితి ఎలా ఉంటుందో.. ఏంటో!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments