Kanna Lakshmi Narayana:ఇమడలేకపోతున్నా : బీజేపీకి కన్నా లక్ష్మీనారాయణ గుడ్‌బై.. వెళ్తూ, వెళ్తూ వీర్రాజుపై వ్యాఖ్యలు
- IndiaGlitz, [Thursday,February 16 2023]
ఏపీ బీజేపీ కీలక నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. గత కొంతకాలంగా కన్నా పార్టీ మార్పుపై జరుగుతున్న ప్రచారానికి ఆయన తెరదించారు. పార్టీని వీడుతున్నట్లు ప్రకటించిన కన్నా.. తన రాజీనామా లేఖను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు పంపారు. ఆయనతో పాటు మరో 15 మంది నేతలు కూడా బీజేపీని వీడారు.
పార్టీని సొంత సంస్థలా నడుపుతున్నాడు :
అనంతరం మీడియాతో మాట్లాడుతూ కన్నా సంచలన వ్యాఖ్యలు చేశారు. 2014లో మోడీ నాయకత్వంపై ఆకర్షితుడినై బీజేపీలోకి వచ్చానని కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. సోము వీర్రాజు అధ్యక్షుడైన తర్వాత పార్టీలో పరిస్ధితులు మారాయని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. వీర్రాజు పార్టీని తన సంస్థలాగా నడుపుతున్నారని కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. కృష్ణా జిల్లాకు రంగా పేరు పెట్టాలని కోరామని.. బీజేపీలో ప్రస్తుతం ఇమడలేకపోతున్నానని, అందుకే రాజీనామా చేశానని ఆయన పేర్కొన్నారు. జగన్ అనాలోచితన నిర్ణయాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేశానని కన్నా గుర్తుచేశారు.
కన్నా వర్గానికి షాకిచ్చిన సోము వీర్రాజు:
ఇదిలావుండగా.. బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు టార్గెట్‌గా గత కొంతకాలంగా విమర్శలు చేస్తున్నారు కన్నా లక్ష్మీనారాయణ. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను సమన్వయం చేసుకుని వెళ్లకపోవడం పార్టీకి నష్టం చేస్తుందని ఆయన తొలి నుంచి హెచ్చరిస్తున్నారు. ఇదే సమయంలో కన్నా వర్గానికి చెందిన పలువురు జిల్లా అధ్యక్షుల్ని అర్ధాంతరంగా తొలగించి.. సోము తన వర్గానికి ప్రాధాన్యత ఇవ్వడం లక్ష్మీనారాయణకు మరింత ఆగ్రహాన్ని తెప్పించింది. పార్టీలో ఏం జరుగుతోందో, ఏం నిర్ణయం తీసుకుంటున్నారో మాజీ అధ్యక్షుడినైన తనకు కూడా చెప్పడం లేదని ఆయన దుయ్యబట్టారు. ఈ క్రమంలో కన్నా పార్టీని వీడాలని దాదాపుగా ఒక అభిప్రాయానికి వచ్చేశారు. దీనిలో భాగంగా తన మద్ధతుదారులు, అనుచరులతో గత కొద్దిరోజులుగా ఆత్మీయ సమావేశాలు నిర్వహించి పార్టీని వీడాలని నిర్ణయించారు.