Kangana and Upasana:సద్గురు వాసుదేవ్‌ త్వరగా కోలుకోవాలని కంగనా, ఉపాసన ప్రార్థనలు

  • IndiaGlitz, [Thursday,March 21 2024]

ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్‌కు బ్రెయిన్ సర్జరీ జరగడంపై ఆయన మద్దతుదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు అసలు ఏమైందంటూ కంగారు పడుతున్నారు. అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలని మునుపటిలా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించాలని కోరుతూ పోస్టులు పెడుతున్నారు.

ఈ క్రమంలోనే బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ అయితే ఆయనను ఐసీయూలో బెడ్‌ మీద చూసి దేవుడే కుప్పకూలిపోయినట్లు అనిపించిందని ఎమోషనల్ అయ్యారు. తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నా శివరాత్రి వేడుకలు నిర్వహించడం గొప్ప విషయమని.. మీరు త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశారు. అలాగే సద్గురు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు మెగా కోడలు ఉపాసన కొణిదెల కూడా పోస్ట్ చేశారు.

అసలు ఏం జరిగిందంటే కొన్ని రోజులుగా తీవ్ర తలనొప్పితో ఇబ్బంది పడుతున్న జగ్గీ వాసుదేవ్ ఇటీవల ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయనను ఢిల్లీ అపోలో ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలోనే వాసుదేవ్ మెదడులో బ్లీడింగ్, వాపు ఏర్పడినట్లు వైద్యులు గుర్తించారు. అనంతరం ఆయనకు బ్రెయిన్ ఆపరేషన్ నిర్వహించినట్లు వెల్లడించారు.

గత నాలుగు వారాలుగా సద్గురు తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నట్లు అపోలో ఆస్పత్రిలోని సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ వినీత్ సూరి వెల్లడించారు. ఈ క్రమంలోనే ఆయనకు ప్రాణాంతకమైన పరిస్థితి నెలకొందని తెలిపారు. సద్గురు మెదడులో బ్లీడింగ్, వాపు ఉన్నట్లు సీటీ స్కాన్‌లో వెల్లడైందని చెప్పారు. వెంటనే ఆయనను ఢిల్లీ అపోలో ఆస్పత్రికి తీసుకువచ్చి సర్జరీ చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం సద్గురుకు విజయవంతంగా ఆపరేషన్ పూర్తి అయిందని.. ఆయన మెల్లగా కోలుకుంటున్నారని తెలిపారు.

మరోవైపు బ్రెయిన్ సర్జరీ జరిగిన తర్వాత సద్గురు మాట్లాడుతున్న ఓ వీడియోను ఈషా ఫౌండేషన్ నిర్వాహకులు విడుదల చేశారు. తనకు ఏం జరగలేదని.. మొదడులో చిన్న వాపు ఉండటంతో వైద్యులు బ్రెయిన్ సర్జరీ ఆపరేషన్ నిర్వహించారని చెప్పారు. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగా ఉందని.. త్వరలోనే మళ్లీ మీ ముందుకు వస్తానని ఆయన చెప్పుకొచ్చారు.