Kanchana 3 Review
ప్రస్తుతం ట్రెండ్‌లో ఉన్న హారర్ కామెడీ చిత్రాలకు రాఘవ లారెన్స్ ఓ బ్రాండ్ అంబాసిడర్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. కమర్షియల్ సినిమాలను డైరెక్ట్ చేసిన లారెన్స్ ముని సినిమాతో హారర్ కామెడీ సినిమా చేసి సక్సెస్ సాధించాడు. అక్కడ నుండి ఈ సిరీస్‌ను కంటిన్యూ చేస్తూ వరుస విజయాలను అందుకుంటున్నాడు. ఈ సిరీస్‌లో నాలుగో భాగంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం `కాంచన 3`. కేవలం హారర్, కామెడీ ఎలిమెంట్స్‌పైనో ఆధారపడకుండా.. చిన్న మెసేజ్‌ను కూడా లారెన్స్ తన సినిమాల్లో ఉండేలా చూసుకుంటూ ఉంటాడు. మరి కాంచన 3లో లారెన్స్ ఏం చెప్పాలనుకున్నాడు. ముని సిరీస్ కంటిన్యూ అవుతుందా? లేదా? అనే విషయాలను తెలుసుకోవాలంటే సినిమా కథేంటో చూద్దాం..
కథ:
రాఘవ(రాఘవ లారెన్స్) అన్న(శ్రీమాన్), తల్లి(కోవై సరళ), వదిన(దేవ దర్శిని)తో సంతోషంగా ఉంటాడు. తాతయ్య(ఢిల్లీ గణేషన్) షష్ఠి పూర్తికి వరంగల్ బయలుదేరుతారు. మార్గమధ్యంలో తిండి తినడానికి ఓ చెట్టు క్రింద కూర్చుంటారు. అనుకోకుండా ఆ చెట్టుకు కొట్టి ఉన్న రెండు మేకులను పీకేస్తారు. అక్కడి నుండి వచ్చేస్తారు. అయితే ఆ మేకులు వారినే ఫాలో అవుతాయి. తాతయ్య ఇంటికి చేరుకున్న రాఘవ.. తన మరదళ్లు(వేదిక, ఓవియా, నిక్కీ తంబోలి)తో ఆడిపాడుతుంటాడు. అయితే రాత్రి సమయం కాగానే ఇంట్లో ఏడుపులు వినిపించడం.. ఎవరో తిరుగుతున్నట్లు కనిపించడంతో ఇంట్లో అందరూ భయపడుతూ ఉంటారు. కుటుంబ సభ్యులు అఘోరాను పిలిపించి పూజలు చేయించినా ఫలితం ఉండదు. రాఘవ విచిత్రంగా ప్రవర్తిస్తుంటాడు. అసలు రాఘవ ఎందుకు విచిత్రంగా ప్రవర్తిస్తుంటాడు? కాళీ ఎవరు? రాఘవకు, కాళీకి ఉన్న సంబంధం ఏమిటి? మినిష్టర్, కాళీకి ఉన్న గొడవేంటి? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..
విశ్లేషణ:
ముందుగా పాత్రధారులు గురించి చెప్పాలంటే.. రాఘవ లారెన్స్ సినిమా అంతా తానే అయ్యి ముందుకు నడిపించాడు. రాఘవగా అమాయకమైన పాత్రలో ఒక వైపు.. కాళి అనే ఫెరోషియస్ పాత్రలో మరో వైపు ప్రేక్షకులను మెప్పించాడు. రెండు పాత్రలకు లుక్ పరంగా.. నటన పరంగా వేరియేషన్ చూపించడంలో రాఘవ లారెన్స్ సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో కాళిగా సినిమా అంతా ప్రధాన పాత్ర అలరించాడు. ఇక హీరోయిన్స్ వేదిక, ఓవియా, నిక్కీ తంబోలి గ్లామర్‌తో పాటు హారర్ సన్నివేశాల్లో భయపడడానికి సరిపోయారు. వీరి పాత్రలకు పెద్దగా ప్రాధాన్యం లేదు. ఇక ముని సిరీస్ కామెడీ పార్ట్‌లో కీలకంగా వ్యవహరిస్తున్న కోవై సరళ, శ్రీమాన్, దేవదర్శిని .. ఈ సినిమాలో కామెడీని పండించడంలో సక్సెస్ అయ్యారు. హారర్ కామెడీ సన్నివేశాల్లో లారెన్స్‌తో కలిసి వీరు అద్భుతంగా నటించారు.
సాంకేతికంగా చూస్తే.. లారెన్స్ నటుడిగా, దర్శకుడిగా ముని సిరీస్‌లో తనదైన స్టైల్లో హారర్, కామెడీ అంశాలతో తెరకెక్కించాడు. అలాగే గత చిత్రాలతో పోల్చితే ఈ చిత్రంలో గ్లామర్ డోస్ పెంచే ప్రయత్నం చేశాడు. ఒక పక్క హారర్, కామెడీ ఎలిమెంట్స్‌తో పాటు హృద్యమైన సన్నివేశాలను కూడా తెరకెక్కించాడు. ఫ్లాష్ బ్యాక్ ఏపిసోడ్ లారెన్స్ సేవా కార్యక్రమాలను తెరపై ఆవిష్కరిస్తుంది. సునిశితంగా నేటి రాజకీయ నాయకుల శైలిని కూడా విమర్శించడం చూస్తుంటే.. లారెన్స్ రాజకీయాల్లోకి రాబోతున్నారేమోననిపిస్తుంది. సినిమాలో హారర్ సన్నివేశాలకు తమన్ తనదైన శైలిలో బ్యాగ్రౌండ్ స్కోర్‌ను అందించాడు. సర్వేష్ మురారి, వెట్రి పళని స్వామి సినిమాటోగ్రఫీ బావుంది.
ముని సిరీస్‌లో నాలుగో భాగంగా వచ్చిన కాంచన 3 ..గత చిత్రాల తరహాలోనే ఉంది. హారర్, కామెడీ సన్నివేశాలు మాస్ ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్ అవుతాయి. ఫ్లాష్ బ్యాక్ ఏపిసోడ్ పెద్దదైనట్లు అనిపించింది. ఈ సినిమాలో కథ కాళి పాత్ర చుట్టూ ప్రధానంగా ఉంటుంది కాబట్టి కాళి పాత్రను చాలా గొప్పగా చూపించే ప్రయత్నం చేశారు. ఇక గ్లామర్ సన్నివేశాలు చూస్తే కుటుంబ సభ్యుల సమక్షంలోనే హీరో, హీరోయిన్స్ రొమాన్స్ చేసుకోవడం ఎంత వరకు కరెక్ట్ అర్థం కాదు.
చివరగా.. హారర్ కామెడీ చిత్రాలను అభిమానించే ప్రేక్షకులకు నచ్చే 'కాంచన 3'
Read 'Kanchana-3' Movie Review in English
- Read in English