Download App

Kanam Review

'మ‌ద‌రాసు పట్ట‌ణం', 'అభినేత్రి` వంటి విల‌క్ష‌ణ చిత్రాల ద‌ర్శ‌కుడు విజ‌య్ చేసిన మ‌రో విల‌క్ష‌ణ‌మైన చిత్ర‌మే 'క‌ణం'. తెలుగు, త‌మిళంలో రూపొందిన ఈ చిత్రంలో చిన్న మెసేజ్‌తో పాటు హార‌ర్ ఎలిమెంట్స్‌ను మిక్స్ చేసి తెర‌కెక్కించాడు ద‌ర్శ‌కుడు విజ‌య్‌. ఈ సినిమాలో నాగ‌శౌర్య‌, సాయిప‌ల్ల‌వి ప్ర‌ధాన జంట‌గా న‌టించ‌డం సినిమాకు మేజ‌ర్ ఎసెట్ అయ్యింది. మ‌రి సినిమా ఎలా ఉందో తెలుసుకోవాలంటే సినిమా క‌థలోకి ఓ లుక్కేద్దాం..

క‌థ‌:

చ‌దువుకునే వ‌య‌సులోనే  తుల‌సి(సాయిప‌ల్ల‌వి)కి కృష్ణ(నాగ‌శౌర్య‌) కార‌ణంగా గ‌ర్భం వ‌స్తుంది. ఇరు కుటుంబాల పెద్ద‌లు ఐదేళ్ల‌కు ఇద్ద‌రికీ పెళ్లి చేయాల‌ని నిర్ణ‌యం తీసుకుంటారు. చిన్న వ‌య‌సులో తుల‌సి గ‌ర్భం దాల్చ‌డం న‌చ్చ‌క‌పోవ‌డంతో ఆ పిండాన్ని చిన్న వ‌య‌సులోనే తీసేయించేస్తారు. కానీ ఆ పిండం ఆత్మ‌గా మారి పెరిగి పెద్ద‌ద‌వుతుంది. ఐదేళ్ల త‌ర్వాత కృష్ణ‌, తుల‌సి పెళ్లి చేసుకుంటారు. ఆ స‌మయంలో ఆత్మ తుల‌సిని ఫాలో అవుతుంటుంది. తాను ఈ భూమిపై రాక‌పోవ‌డానికి కార‌ణ‌మైన వారిని చంపాల‌నుకుంటుంది. అంద‌రినీ చంపేస్తుంది. చివ‌ర‌కు తండ్రి కృష్ణ‌ను కూడా చంపాల‌నున‌కుంటుంది. ఇంత‌కు ఆత్మ కృష్ణ‌ను ఎందుకు చంపాల‌నుకుంటుంది? ఆత్మ చేసే హ‌త్య‌లు గురించి తెలుసుకున్న తుల‌సి చివ‌ర‌కి ఏం చేస్తుంది?  అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

విశ్లేష‌ణ‌:

ద‌ర్శ‌కుడు విజ‌య్ భ్రూణ హ‌త్య‌లు గురించి ... ఎవ‌రో చేసిన త‌ప్పుల‌కు ఎవ‌రో బాధ్య‌త ఎందుకు వ‌హించాలి? అనే అంశాల‌ను మెసేజ్ రూపంలో చెప్పాల‌నుకున్నాడు. ద‌ర్శ‌కుడు తెర‌పై చూపించాల‌నుకున్న పాయింట్ బాగానే ఉంది. అయితే కొన్నిసార్లు పాయింట్ బావున్నా క‌థ‌,క‌థ‌నం, పాత్ర‌ల చిత్రీక‌ర‌ణ‌, స‌న్నివేశాల అమ‌రిక‌, ఎమోష‌న్స్ స‌రిగా లేక‌పోవ‌డం అంశాలు సినిమాకు మైన‌స్‌గా మారుతాయి.`క‌ణం` సినిమా విష‌యంలో అదే జ‌రిగింది. సినిమాలో చివ‌రి 10 నిమిషాలు మిన‌హా ఎమోష‌నల్ పాయింట్ లేదు. ఏదో సినిమాను సాగ‌దీయాల‌నే అంశంతో సినిమా చేసిన‌ట్లు క‌న‌ప‌డుతుందే కానీ.. బ‌ల‌మైన కంటెంట్ సినిమాలో లేదు. శామ్ బ్యాగ్రౌండ్ స్కోర్ బావుంది. నీర‌వ్ సినిమాటోగ్ర‌ఫీ కూడా బావుంది. త‌ల్లిదండ్రులు పిల్లల భ‌విష్య‌త్ దృష్ట్యా చేసిన ప‌ని ఎందుకు త‌ప్పు అవుతుంది?  వారేం మోసం చేయ‌లేదు క‌దా! అస‌లు ఆత్మ ప‌గ‌బ‌ట్టాల్సినంత విష‌య‌మేంటో తెలియ‌దు. అస‌లు ఆత్మ‌కు ప‌గ తీర్చుకోవ‌డానికి ఐదేళ్ల స‌మ‌యం ఎందుకు తీసుకుంటుందో తెలియ‌దు. లాజిక్‌ల‌కు దూరంగా ఉండే కాన్సెప్ట్‌. 

బోట‌మ్ లైన్‌: క‌ణం... మెప్పించ‌ని క‌థాంశం

Rating : 2.0 / 5.0