బలపరీక్షకు సై అంటున్న కమల్‌నాథ
- IndiaGlitz, [Friday,March 13 2020]
మధ్యప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. రాష్ట్రానికి కీలకనేత, మాజీ కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింధియా కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి బీజేపీ తీర్థం పుచ్చుకోవడంతో సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. కమలనాథ్ సీఎం పీఠానికి ఎసరువచ్చి పడింది. సింధియాతో పాటు మరో 19 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు ఇదివరకే ప్రకటించేశారు. అయితే ప్రస్తుతం ఆ ఎమ్మెల్యేలు అంతా బెంగళూరులోని ఓ ప్రముఖ రిసార్టులో ఉన్నారు. ఇలా మొత్తం 22 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నారు. ఇదే జరిగితే.. కమలనాథ్ సీఎం పీఠం బీజేపీ ఖాతాలో పడుతుంది.
13 మందికి నోటీసులు!
ఈ క్రమంలో మధ్యప్రదేశ్ గవర్నర్‌తో ముఖ్యమంత్రి కమల్ నాథ్ సమావేశమయ్యారు. అసెంబ్లీ బలపరీక్షకు అనుమతించాలని కోరారు. అంతేకాదు.. బీజేపీ పాలిత రాష్ట్రం కర్ణాటకలోని బెంగళూరులో బంధీలుగా ఉన్న 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను వెనక్కు రప్పించడానికి తగు చర్యలు తీసుకోవాలని స్పీకర్‌కు ఈ సందర్భంగా లేఖ కూడా రాశారు. ఈ సందర్భంగా.. మొత్తం 22 మందిలో 13 మంది ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్ ఎన్‌పీ ప్రజాపతి నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. వీరిలో ఆరుగురు మంత్రులు కూడా ఉండటం గమనార్హం. శనివారంలోగా తన ఎదుటు హజరై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో ఆయన పేర్కొన్నారు.
హామీ ఇస్తున్నా..
‘మా ఎమ్మెల్యేల కొనుగోళ్లకు బీజేపీ తెరతీసింది. మధ్యప్రదేశ్‌లో అనైతిక, అప్రజాస్వామ్యక విధానాలకు బీజేపీ తెరతీసింది. ఈ చర్యలతో ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రమాదంలో పడింది. బాధ్యతాయుతమైన కాంగ్రెస్ నేతగా స్పీకర్ సూచనల మేరకు మధ్యప్రదేశ్ అసెంబ్లీలో మార్చి 16న విశ్వాస పరీక్షను ఎదుర్కొడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రజాస్వామ్యం, శాసన ప్రక్రియ విజయాన్ని నిర్ధారించడానికి, రాజ్యాంగంలో పొందుపర్చిన విలువలను నిలబెట్టే క్రమంలో నేను ఎలాంటి అనైతిక చర్యలకు పాల్పడబోను. ఈ సందర్భంగా మధ్యప్రదేశ్ ప్రజలకు హామీ ఇస్తున్నాం’ అని లేఖలో కమల్‌నాథ్ నిశితంగా వివరించారు.