మెరిసిన కమల.. మురిసిన భారత్
Send us your feedback to audioarticles@vaarta.com
అమెరికా చరిత్రలో ఇది సరికొత్త అధ్యాయం.. అమెరికా ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కాపాడారు.. బైడన్‌ను అధ్యక్షుడిగా ఎన్నుకున్న ప్రజలకు ధన్యవాదాలు.. అమెరికాలో పాతుకుపోయిన జాతివివక్షను నిర్మూలిద్దాం... మన ముందు ఉన్న లక్ష్యాలు అంత సులువైనవి కాదు... కఠినమైన లక్ష్యాల కోసం నిరంతరం పోరాడుదాం - కమలా హారిస్
అమెరికా మొట్టమొదటి మహిళా ఉపాధ్యక్షురాలి పదవిని కమలా హ్యారిస్ అలంకరించబోతున్నారు. ఆమె ప్రత్యేకతలు ఒకటి కాదు.. రెండు కాదు.. జాతి వివక్షను దాటుకుని.. ఓ భారత సంతతి వనిత అగ్రరాజ్యం గడ్డంపై అతి పెద్ద అవకాశాన్ని దక్కించుకుంది. అగ్రరాజ్యం ఉన్నత స్థానాల్లో ఇంతటి గొప్ప స్థానాన్ని దక్కించుకున్న తొలి మహిళ. అమెరికా ఉపాధ్యక్ష పదవికి ఎన్నికైన తొలి మహిలే కాకుండా మొదటి నల్లజాతీయురాలు కూడా కావడం విశేషం. తాను ఇంతటి గొప్ప స్థాయికి రావడానికి కారణం తన తల్లేనని కమల చెబుతుంటారు. కమల తల్లి ఎవరో కాదు.. మన తమిళనాడుకు చెందిన వ్యక్తే కావడం విశేషం. ఆమె పేరు శ్యామలా గోపాలన్.
శ్యామల.. తమిళనాడులోని తిరువరూర్ జిల్లా తులసేంద్రపురం గ్రామానికి చెందిన సివిల్ సర్వెంట్ పి.వి.గోపాలన్ కుమార్తె. న్యూఢిల్లీలోని లేడీ ఇర్విన్ కాలేజీలో బీఎస్సీ(హోం సైన్స్) పూర్తి చేశారు. ఆ తరువాత 1958లో అంటే తనకు 19 ఏళ్ల వయసున్నప్పుడు అమెరికాకు చదువుల నిమిత్తం వెళ్లారు. బర్కెలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో చేరి 1964లో పీహెచ్డీ పట్టా తీసుకున్నారు. క్యాన్సర్ పరిశోధకురాలిగా ఆమె ఉద్యోగంలో స్థిరపడిపోయారు. అనంతరం జమైకాకు చెందిన డొనాల్డ్ జె హారిస్‌ను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు కమల, మాయ జన్మించారు. అయితే కమలకు ఏడేళ్లున్నప్పుడే తల్లిదండ్రులు విడిపోయారు. తల్లే తన ఇద్దరు కూతుళ్లను కంటికి రెప్పలా పెంచుకున్నారు.
తమిళనాడులోని తన తల్లిదండ్రుల వద్దకు అప్పుడప్పుడు శ్యామల తన పిల్లలతో వచ్చి వెళ్లేవారు. ఈ విషయాన్ని స్వయంగా కమల ఇటీవల జరిగిన ఒక ప్రచార కార్యక్రమంలో వెల్లడించారు. తనను, తన సోదరిని తన తల్లి అప్పుడప్పుడు తమిళనాడుకు తీసుకెళ్లే వారని.. ఆమెచేసిన ఇడ్లీల రుచిని ఎప్పటికీ మరిచిపోలేనని చెబుతూ కమల భావోద్వేగానికి గురయ్యారు. తెల్లజాతి పిల్లలు తమను ఆడుకోవడానికి రానిచ్చేవారు కాదని.. అమెరికా తమను నల్లజాతి మనుషులుగానే చూస్తుందని తన తల్లికి అర్థమైందని కమల వెల్లడించారు. ఈ కారణంగానే తమను ఆత్మవిశ్వాసానికి ప్రతీకలుగా ఉండే నల్లజాతి మహిళలుగా తన తల్లి తీర్చిదిద్దారని కమల తన ఆత్మకథ.. ‘ద ట్రూత్ వియ్ హోల్డ్’ ద్వారా వెల్లడించారు.
కమలా హ్యారిస్ న్యాయ విద్యను పూర్తి చేసి.. 26 ఏళ్ల వయసులో కాలిఫోర్నియా బార్ అసోసియేషన్‌లో చేరారు. అలమెడా కౌంటీలో డిప్యూటీ డిస్ట్రిక్ట్ అటార్నీగా నియమితులయ్యారు. 1998లో శాన్ఫ్రాన్సిస్కో అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ అటార్నీగా.. 2004 నుంచి 2011 వరకు శాన్ఫ్రాన్సిస్కో డిస్ట్రిక్ట్ అటార్నీగా వ్యవహరించారు. 2011 నుంచి 2017 వరకు కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా సేవలందించారు. 2016లో కాలిఫోర్నియాలో జరిగిన సెనెట్ ప్రాథమిక ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీలో పోటీచేసి 30 లక్షల పైచిలుకు ఓట్లతో మొదటిస్థానంలో నిలిచారు. తాజాగా అమెరికా తొలి ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout